సొంత పార్టీ వాళ్లకే ఫిటింగ్ పెడుతున్న జూపూడి

జూపూడి ప్రభాకర్ రావు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి, తదనంతర పరిణామాల్లో తెలుగుదేశంలోకి ఫిరాయించిన దళిత నాయకుడు. జగన్ మీద సామాజిక వర్గం పరంగా బురద చల్లడానికి బాగా ఉపయోగపడతాడనే ఉద్దేశంతో అక్కున చేర్చుకున్న చంద్రబాబు.. ఎన్నో తరాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న దళితుల్ని కాదని.. జూపూడికి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గిరీని కట్టబెట్టారు. ఇప్పటికి రెండేళ్లుగా ఆ పదవిలో ఉన్న జూపూడి.. తాజాగా తన సొంత పార్టీ వారికి ఫిటింగ్ పెడుతున్నాడేమో అనిపిస్తోంది. తాను బాగా పనిచేస్తున్నానని చాటుకోడానికి తన ప్రతిభ గురించి చెప్పుకుంటే చాలు.. మిగిలిన అందరూ కూడా తనలాగా చేయాలంటూ.. వారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. జూపూడి ఎస్సీ కార్పొరేషన్ పదవి తీసుకుని రెండేళ్లు పూర్తయింది. తన పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు పెట్టుకోవాలని ఆయనకు కుశాల కలిగింది. అంతే ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటిదాకా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమేం పనులు చేశారు. ఎంతమంది ఎస్సీలకు ఎలాంటి లబ్ధి కలిగించారు. ఇంకా ఏమేం లబ్ధి కలిగించబోతున్నారు. ఈ లబ్ధిదారుల్ని ఎంపిక చేసుకోవడంలో అనుసరించిన పద్ధతులు ఏంటి.. అంటూ అనేక సంగతులను ఒక శ్వేతపత్రంలాగా విడుదల చేసేశారు. అంతవరకు బాగానే ఉంది.

అయితే తన గురించి తాను టముకు వేసుకునే కార్యక్రమంలో భాగంగా.. జూపూడి ఏకంగా అధినేత చంద్రబాబును, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా మాట్లాడారని పార్టీలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఎస్సీ యువతకు ఇనోవా కార్లు పంపిణీ చేసిన పథకం గణాంకాలు సమర్పిస్తూ.. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సూచించిన వారికి ఈ పథకం ద్వారా ఇనోవాలు ఇచ్చినట్లు జూపూడి చెప్పుకొచ్చారు. అసలే చంద్రబాబునాయుడు ప్రభుత్వం సంక్షేమ పథకాల ముసుగులో అంతా తమ పార్టీ కేడర్ కు పచ్చ చొక్కాల వారికి మాత్రమే దోచిపెడుతున్నదనే విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. మళ్లీ.. నాయకులు సూచించిన బారినే లబ్ధిదారులుగా ఎంపిక చేశాం అని జూపూడి చెప్పడం విశేషం.

పైగా తాను వివరాలను శ్వేతపత్రంగా విడుదల చేసినట్లే.. తనలాంటి ఇతర కార్పొరేషన్ ల వారందరూ కూడా తమ పనితీరును శ్వేతపత్రంగా విడుదల చేస్తే బాగుంటుందని జూపూడి ఓ ఉచిత సలహా పడేశారు. నిజానికి కార్పొరేషన్ లకు ఇచ్చే నిధుల్లో ప్రభుత్వం బోలెడు మతలబులు నడిపిస్తుంటుంది. ప్రతి కార్పొరేషన్ వైట్ పేపర్ (శ్వేతపత్రం) విడుదల చేయడం అంటే.. తమను తామే ఇరుకున పెట్టినట్లు అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు