సోమిరెడ్డీ.. ‘బ్రీఫింగ్‌’ బాబు సంగతేంటి.!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడిగా వుండడానికి వీల్లేదట. రాజకీయ వ్యవస్థకే అది మాయని మచ్చ అట. 12 కేసుల్లో నిందితుడిగా వున్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా వున్న చరిత్ర దేశంలో ఎక్కడాలేదట. కోర్టుతీర్పు తర్వాత జగన్‌ రాజకీయాల్లో కొనసాగడానికి అనర్హుడట. ఇది మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉవాచ.

ప్రధాని నరేంద్రమోడీ మీదా కేసులున్నాయి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పుత్రరత్నం అప్పనంగా కోట్లు కూడగట్టిన వైనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి, రాజకీయాల్లో ‘కేసులు’ వుండడం అనేది అదనపు క్వాలిఫికేషన్‌గా మారిపోయిందిప్పుడు. ఒకప్పుడు ప్రజా పోరాటాల నేపథ్యంలో కేసులుండేవి. అది ఆయా నాయకులకి ప్రత్యేక గౌరవం తెచ్చిపెట్టేది. ఇప్పుడు పరిస్థితి వేరు.

టీడీపీ అధినేత చంద్రబాబు విషయాన్నే తీసుకుంటే, ఓటుకు నోటు కేసు సంగతేంటట.? చంద్రబాబు ఆ కేసుకు సంబంధించి ఎంత గొప్పగా ‘బ్రీఫింగ్‌’ చేశారో ప్రపంచమంతా వినేసింది. ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని, తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ని చేసిందెవరు.? చంద్రబాబు కాదా.! ఇలాగే, తమ కింద మచ్చల్ని మర్చిపోయి.. ప్రత్యర్థుల మీద బురద జల్లడంతోనే, రాజకీయాల్లో ‘విలువలు’ సర్వనాశనమైపోతున్నాయి.

12 కేసుల్లో జగన్‌ నిందితుడు మాత్రమే. దోషి అని ఇంతవరకు న్యాయస్థానం ధృవీకరించలేదు. రేవంత్‌రెడ్డి విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా వుంది. రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి రేవంత్‌రెడ్డి చిక్కేశారాయె. ఆ వ్యవహారంలో ‘బ్రీఫింగ్‌’ బాబు కూడా ఆడియో టేపుల్లో అంతే రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కేసిన విషయాన్ని ఎలా కాదనగలం.?

జగన్‌ని ఎంత గట్టిగా విమర్శిస్తే, అధినేత చంద్రబాబు దగ్గర అంతగా మార్కులు కొట్టేయొచ్చన్న ‘అత్యుత్సాహం’ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలో స్పష్టంగా కన్పిస్తోంది. ఆల్రెడీ ఆ ‘అత్యుత్సాహానికే’ మంత్రి పదవి దక్కేసిందిగా.. ఇంకేం ఆశించి, సోమిరెడ్డి ఇంకా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు.? ఈ అత్యుత్సాహంలో ‘తమకింది మచ్చల్ని’ సోమిరెడ్డి మర్చిపోతున్నట్టున్నారు.