స్వీయ నియంత్రణ – నవ్విపోదురుగాక.!

ప్రజా వ్యతిరేక చర్యలు చేపడ్తున్న ప్రభుత్వాలపై సామాన్యుడికి కడుపు మండి, సోషల్‌ మీడియాలో స్పందిస్తే.. ఆ సామాన్యుడిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్‌ చేసి జైలుకు పంపి ప్రభుత్వాలు పండగ చేసుకుంటోన్న రోజులివి. భావ ప్రకటనా స్వేచ్ఛ.. అన్న మాటకు అర్థం ఏమన్నా వుందా ఈ రోజుల్లో.?

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు’ అంటూ, ఓ సామాజిక వర్గాన్ని తూలనాడుతూ పుస్తకం రాశాడో ప్రొఫెసర్‌. అతనే కంచ ఐలయ్య. ‘మేం స్మగ్లర్లమా.? మమ్మల్ని అంత దారుణంగా ఎలా దూషిస్తారు.?’ అంటూ ఆర్య వైశ్య సామాజిక వర్గం తరఫున రామాంజనేయులు అనే న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, సర్వోన్నత న్యాయస్థానం ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ పాఠాలు చెప్పింది. అంతేనా, రచయితలకు స్వీయ నియంత్రణ వుండాలనీ క్లాసులు తీసుకుంది.

సమస్య వస్తోన్నదే స్వీయ నియంత్రణ విషయంలో. ప్రస్తుతం ఎవరికీ నియంత్రణే లేదు. ఎవర్ని తిట్టాలనుకుంటున్నారో, వాళ్ళని తిట్టేయడం ఓ ఫ్యాషన్‌ అయిపోయింది. కంచె ఐలయ్య చేస్తున్నది ఇదే. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు తప్ప ఇంకెవరూ దేశభక్తులే కాదన్నది కంచె ఐలయ్య వితండవాదం. ప్రొఫెసర్‌కి మాత్రమే భావ ప్రకటనా స్వేచ్ఛ వుంటుందా.? ఇంకెవరికీ వుండదా.? ఈ అంశంపై ఇప్పుడు అవసరమైనంతమేర చర్చ జరిగి తీరాల్సిందే.

సర్వోన్నత న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పునివ్వడంతో కంచె ఐలయ్య మరింతగా రెచ్చిపోతున్నారు. తమపై ఓ పుస్తకం వచ్చినందుకు కోమట్లు గర్వపడాలని తన పుస్తకం గురించి కంచె ఐలయ్య చెబుతూ, ఆర్య వైశ్య సామాజిక వర్గాన్ని మరింతగా రెచ్చగొడ్తున్నారు. కంచె ఐలయ్యని దూషిస్తూ ఎవరన్నా పుస్తకం రాస్తే ‘నిజమే కదా, నేనలాంటోడ్నే కదా..’ అని ఆయన సంతోషపడ్తాడా.? నవ్విపోదురుగాక.. అన్నట్టుంది ఆయనగారి వ్యవహారం.

మొత్తమ్మీద, తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కంచె ఐలయ్య పుస్తక వివాదంలో, ఆర్య వైశ్య సామాజిక వర్గానికి పెద్ద షాకే తగిలింది. అసలే అవమాన భారంతో రగిలిపోతున్న ఆర్య వైశ్య సామాజిక వర్గం, ఆ పుస్తకం విషయంలో ఎలాంటి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తుందో వేచి చూడాల్సిందే.