హన్సికకి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే

ఏరు దాటాక తెప్ప తగలేయడంలో చాలామంది హీరోయిన్లు ముందుంటారు. సౌత్‌లో పలు సినిమాల్లో నటించి, స్టార్‌డమ్‌ సంపాదించుకుని, బాలీవుడ్‌కి వెళ్ళాక సౌత్‌ సినిమాల్ని ఎగతాళి చేయడం చాలామందికి అలవాటే. రాధికా ఆప్టే, తాప్సీ, ఇలియానా ఆ కోవకి చెందినవారే. ‘సౌత్‌ సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌కే ఎక్కువ ప్రయార్టీ..’ అంటూ ఆయా హీరోయిన్లు సౌత్‌ సినిమాపై చేసిన విమర్శల్ని ఎలా మర్చిపోగలం.?

ఇక, తాజాగా ఓ బుల్లితెర నటి కూడా ఇదే బాటలో సౌత్‌ సినిమాని విమర్శిస్తే, దానికి కౌంటర్‌ ఇస్తూ కస్సుబుస్సులాడింది హన్సికా మోత్వానీ. తెలుగులో ‘దేశముదురు’ ఆమెకి హీరోయిన్‌గా తొలి సినిమా. నిజానికి, బాల నటిగా బాలీవుడ్‌లోనే ఆమె ముందుగా నటించేసింది. హీరోయిన్‌గా ఒకటీ అరా బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతానికి తమిళ సినీ పరిశ్రమలో సెటిలైపోయింది హన్సిక.

‘మా సౌత్‌ సినిమాని విమర్శించే నైతిక హక్కు నీకెక్కడిది.? సిగ్గుండాలి విమర్శించడానికి..’ అంటూ హన్సిక విరుచుకుపడ్డతీరు అందర్నీ విస్మయానికి గురిచేసింది. తమిళ తంబిలైతే హన్సిక స్పందనకు హేట్సాఫ్‌ అనేస్తున్నారు. అసలే సోషల్‌ మీడియాలో హన్సిక చాలా యాక్టివ్‌గా వుంటుంది. ఆ సోషల్‌ మీడియా ద్వారానే హన్సిక సౌత్‌ సినిమాపై తన అభిమానాన్ని చాటుకోవడం గమనార్హం.

హన్సిక కస్సుబుస్సులాడడంలోనూ అర్థం లేకపోలేదు. ఎక్స్‌పోజింగ్‌కి టాలీవుడ్‌ ఏంటి.? కోలీవుడ్‌ ఏంటి.? బాలీవుడ్‌ ఏంటి.? బాలీవుడ్‌లో వచ్చినట్లుగా ‘అడల్ట్‌ రేటెడ్‌ కంటెంట్‌తో’ సినిమాలు సౌత్‌లో రాగలవా.?