హమ్మయ్య.. మోడీకి దొరికిందో ఊరట.!

ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీకి ఓ ఊరట దొరికింది. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’కి సంబంధించి వరల్డ్‌ బ్యాంక్‌ ప్రకటించిన తాజా ర్యాంకింగుల్లో భారతదేశానికి 100వ ర్యాంక్‌ దక్కింది. గత ఏడాది ఇది 130గా నమోదయ్యింది. ఇకనేం, కమలనాథులు పండగ చేసేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అయితే ట్విట్టర్‌ వేదికగా ఎడా పెడా ట్వీట్లు దంచేశారు. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని ప్రశ్నించేశారు. గడచిన మూడున్నరేళ్ళుగా తాము పడ్డ కష్టానికి సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా విపక్షాలపై విసుర్లూ దంచేశారనుకోండి.. అది వేరే విషయం.

పెద్ద పాత నోట్ల రద్దు, జీఎస్‌టీ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిన మాట వాస్తవం. ఈ విషయాన్ని అనేక సర్వేలు తేల్చి చెప్పాయి. జీడీపీ సహా పలు సూచికలు, దేశ ఆర్థిక వ్యవస్థకు తగిలిన దెబ్బ గురించి స్పష్టంగా పేర్కొనడంతో, గత కొద్ది రోజులుగా కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పెద్ద నోట్ల రద్దుని, భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక కుంభకోణంగా అభివర్ణించారు. జీఎస్‌టీని గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌గా పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో నరేంద్రమోడీకి పెద్ద ఊరటనిచ్చింది వరల్డ్‌ బ్యాంక్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకుల ప్రకటనతో. ఒకే ఏడాది 30 ర్యాంకులు మెరుగుపరచుకోవడం చిన్న విషయం కాదన్నది నరేంద్రమోడీ ఉవాచ. అందులో నిజం లేకపోలేదు. కానీ, ఇది ‘వ్యాపార’ కోణంలో మాత్రమే. కానీ, ఆ ‘వ్యాపారం’ దేశ ఆర్థిక రంగానికి ఎంత ఊతమిస్తుంది.? నిరుద్యోగానికి ఎలా చెక్‌ పెట్టగలుగుతుంది.? అన్నవి ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలే. పైకి కన్పించే లెక్కలకీ, వాస్తవ అభివృద్ధికీ స్పష్టమైన తేడా ఎప్పుడూ వుంటూనే వుంటుందనుకోండి.. అది వేరే విషయం.

ఆర్థిక లోటుతో, అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో వున్న ఆంధ్రప్రదేశ్‌కి గతంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో మెరుగైన ర్యాంకులు రావడం అప్పట్లో అందర్నీ విస్మయానికి గురిచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో మోడీ, ఊపిరి పీల్చుకోవాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. అన్నట్టు ఈ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే తొలి ర్యాంకు దక్కితే, నగరాల్లో హైద్రాబాద్‌ రెండో స్థానం దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం 15వ ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అన్నట్టు, పేదల పొట్టకొట్టి పెద్దలను మేపాలన్న పాలకుల నిర్ణయాల నేపథ్యంలో ఈ తరహా ర్యాంకులు రావడం గొప్ప విషయమేనా.? అన్న విమర్శలు వామపక్షాల నుంచి రావడం మామూలే. ఇది కూడా పాయింటేనేమో.!