హాట్ టాపిక్ గా “79 రోజులు’”

బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా మీద మొదట్నించి భారీగానే అంచనాలు ఉన్నాయి. చారిత్రక కథాంశంతో నిర్మించిన ఈ సినిమాను క్రిష్ దర్శకత్వం వహించటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. దర్శకుడి టాలెంట్ మీద నమ్మకం ఉన్నప్పటికీ.. భారీ యుద్ధ సన్నివేశాల్ని తక్కువ వ్యవధిలో ఎలా తీశారన్న ఆసక్తి పలువురిలోకనిపించింది.

కేవలం 79 రోజుల్లో పూర్తి చేసిన ఈ చిత్ర షూటింగ్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రయత్నిస్తే.. తక్కువ వ్యవధిలోనూ చక్కటి సినిమాలు తీయొచ్చన్నవాదనను కొందరు వినిపిస్తే.. క్రిష్ లాంటి దర్శకుడు రాజీ పడే ప్రసక్తే ఉండదని.. పక్కా ప్రణాళికతో చేస్తే తక్కువ సమయంలోనూ మంచి సినిమాను తీయటం కష్టం కాదన్న మాట వినిపించింది.

దీనికి తగ్గట్లే కేవలం రెండున్నర నెలల మీద నాలుగైదు రోజులు మాత్రమే షూటింగ్ చేసి.. భారీ సినిమాను సిద్ధం చేయటం గొప్పగా ఉందని ఇప్పుడు అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినిమా విడుదలై.. ప్రత్యేక షోను చూసిన వారి నోటి నుంచి వస్తున్న మాట ఒక్కటే. ఈ సినిమా చాలా బాగుందని.. అన్నింటికి మించి కేవలం 79రోజుల్లో ఇంత బాగా సినిమా తీయొచ్చా? అన్న ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

కొంతమంది దర్శకులు.. కొందరు అగ్ర హీరోలు నెలల తరబడి షూటింగ్ చేయటం.. అదేమంటే.. క్వాలిటీ కోసం ఆ మాత్రం టైం పడుతుందన్న మాటల్లో నిజం లేదన్న విషయాన్ని శాతకర్ణతో క్రిష్ తేల్చేశాడు. ఇప్పటివరకూ క్వాలిటీ మాటల్ని చెప్పి కాలం గడిపేసే వారికి షాకిచ్చేలా శాతకర్ణి 79 రోజుల షూట్ ఒక పాఠంగా మారుతుందనటంలో సందేహం లేదు. ఇకపై క్వాలిటీ కోసం టైం చాలా కావాలనే మాటలు బంద్ కావటం ఖాయం.