హీరోగారు కాంగ్రెస్‌ను వీడుతున్నారట..!

కర్ణాటక రాజకీయాల్లో మరో స్పైసీ న్యూస్ తెర మీదకు వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రెబల్ స్టార్ అంబరీష్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా పార్టీలో అంత యాక్టివ్ కనిపించడం లేదు అంబరీష్. ఆ మధ్య ఈయనను మంత్రి వర్గం నుంచి తప్పించారు. అప్పట్లోనే ఈయన కాంగ్రెస్ ను వీడే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరిగింది.

అయితే అప్పుడు కాదు కానీ, ఇప్పుడు మాత్రం అంబీ కాంగ్రెస్ ను వీడటం ఖాయమనే మాట వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ ను వీడి అంబీ ఎక్కడ వెళ్తాడు అంటే.. బీజేపీ అనే సమాధానం రావడం లేదు. చిత్రంగా జేడీఎస్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని.. అంబరీష్ జేడీఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఒక సినీ హీరో ఇలా జాతీయ పార్టీని వీడి ప్రాంతీయ పార్టీలో చేరడం విశేషమే అవుతుంది.

ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్ కు మంచి ఊపే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలతో అధికారం సాధించుకోకపోయినా.. కింగ్ మేకర్ ఛాన్స్ మాత్రం జేడీఎస్ కే దక్కవచ్చు అనే మాట వినిపిస్తోంది. మరి అంబీ అక్కడకు వెళ్లి కుమారస్వామి ముందు చేతులు కట్టుకుని నిలబడతాడా? అనే సందేహం రావొచ్చు.

అయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో పార్టీలు మారడం విషయంలో తెలుగు వాళ్ల కన్నా ఘనులు కన్నడ రాజకీయ నేతలు.. ఇలా జంపింగ్ చేసేయడం , కావాలంటే మళ్లీ కాంగ్రెస్ లోకి తిరిగిరావడం అంబీకి పెద్ద కష్టం కాకపోవచ్చు.