హోలీ రోజు జగన్ కి రంగు పడింది

దేశ‌వ్యాప్తంగా హోలీ పండుగ జ‌రుగుతుండ‌గా…ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి రంగు ప‌డింది. వైసీపీ అధినేత‌కు ఆయన పార్టీ రంగుల కారణంగానే రంగుల పండుగ మ‌ర‌చిపోయేలా నిలిచింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. స్థానిక ఎన్నికల నేప‌థ్యంలో పంచాయతీ భవనాలకు, ఇతర ప్రభుత్వ భవనాలకు వేసిన రాజకీయ రంగులను తొలగించాలని కీలక తీర్పు వెలువరించింది.

పంచాయతీ భవనాలు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వైసీపీ రంగులు వేస్తున్నారంటూ గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. పంచాయతీ భవనాలతో పాటుగా ప్రభుత్వ భవనాలకు పది రోజుల్లోగా కొత్త రంగులు వేయాలని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. పది రోజుల్లో మళ్లీ వేరే రంగులు వేసి, కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.

కాగా, స్థానిక సంస్థల ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు ఇది వ‌రుస‌గా రెండో షాక్ అనుకోవ‌చ్చు. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను సస్పెండ్ చేసింది. అలాగే సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను గుర్తు చేసి 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఉండాలన్న విషయాన్నీ హైకోర్టు స్పష్టం చేసింది. 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించింది. అలాగే స్థానికసంస్థల ఎన్నికలపై ప్రభుత్వ జీవోను హైకోర్టు రద్దు చేసింది. 4 వారాల తరువాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.