25 కోట్ల తొలి ప్రేమ

మంచి కంటెంట్ ఉన్న సినిమాకు అన్ని అంశాలూ కలిసొస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పడానికి ‘తొలి ప్రేమ’ రుజువుగా నిలుస్తోంది. ఫిబ్రవరి అంటే మామూలుగా అన్ సీజన్ అని అంటుంటారు. ఈ నెలలో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు ఉండవు. కానీ ‘తొలి ప్రేమ’ మాత్రం మంచి సీజన్లలో మాదిరే అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 25 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయడం విశేషం.షేర్ రూ.16 కోట్లకు చేరువగా ఉండటం విశేషం. శనివారం రిలీజైన ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో అంచనాల్ని మించి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. సోమవారం కలెక్షన్లు కొంచెం డ్రాప్ అయ్యాయి కానీ.. ఆ రోజు ఆ మాత్రం మామూలే.

ఐతే మంగళవారం శివరాత్రి సెలవు కావడంతో ‘తొలి ప్రేమ’ అదరగొట్టేసింది. పోటీగా వచ్చిన సినిమాలు తుస్సుమనిపించడంతో ‘తొలి ప్రేమ’దే హవా అయింది. నాలుగో రోజు ఈ చిత్రానికి రూ.2.7 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు అంచనా. తొలి రోజు వసూళ్లకు చాలా దగ్గరగా ఈ కలెక్షన్లు ఉండటం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.11 కోట్ల దాకా షేర్ రూ.18.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. అమెరికాలో ఈ చిత్రం మిలియన్ మార్కు దిశగా అడుగులేస్తోంది.

వీకెండ్లోనే హాఫ్ మిలియన్ మార్కును దాటిన ఈ చిత్రం.. తర్వాతి రెండు రోజుల్లో ఇంకో 2 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఈ వీకెండ్లో వచ్చే సినిమాల ఫలితాన్ని బట్టి ఈ చిత్రం మిలియన్ మార్కును దాటుతుందా లేదా అన్నది ఆధారపడి ఉండొచ్చు. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే మాత్రం మిలియన్ మార్కు పక్కా అనే అనిపిస్తోంది.