50 పూర్తయితే.. భరత్ కూడా అక్కడికే

అంతర్జాతీయ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్.. ఇండియాలో బాగానే దూకుడు చూపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలపై కూడా బాగానే కన్నేసింది ఈ కంపెనీ. బడా సినిమాలకు సంబంధించిన శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంటూ.. వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బిగ్ బడ్జెట్ మూవీస్ కు భారీగానే ధర ఆఫర్ చేస్తుండడంతో.. మన మేకర్స్ కూడా డిజిటల్ రైట్స్ హోల్ సేల్ గా ఇచ్చేస్తున్నారు.

రీసెంట్ గా రామ్ చరణ్ మూవీ రంగస్థలంను.. సినిమా రిలీజ్ అయిన 45 రోజులకే అమెజాన్ లో పెట్టేశారు. కేవలం ప్రైమ్ కస్టమర్లకు మాత్రమే చూసే అవకాశం ఉన్నా.. ఈ మెంబర్ షిప్ నామమాత్రమే కావడం(ఏడాదికి వెయ్యి రూపాయలు)తో డిమాండ్ బాగానే పెరుగుతోంది. థియేటర్లలో నడుస్తున్న రంగస్థలం విషయంలో విమర్శలు వచ్చినా ఈ కంపెనీ తగ్గలేదు. ఇప్పుడు మహేష్ మూవీ భరత్ అనే నేను విషయంలో కూడా అమెజాన్ దూకుడు చూపిస్తోంది. జూన్ 9 నుంచి ఈ సినిమా అమెజాన్ లో అందుబాటులో ఉండనుంది.

ఆ ముందు రోజుతో భరత్ అనే నేను సరిగ్గా 50 రోజులను పూర్తి చేసుకుంటుంది. సరిగ్గా 51 రోజున భరత్ అమెజాన్ లోకి వచ్చేస్తోందన్న మాట. యంగ్ చీఫ్ మినిస్టర్ పాత్రలో మహేష్ బాబు.. అతనికి జోడీగా కైరా అద్వానీ నటించిన భరత్ అనే నేను.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందింది. థియేటర్లలో సెన్సేషనల్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. అమెజాన్ లో కూడా భారీ వ్యూయర్ షిప్ సాధించే అవకాశం ఉంది.