900 మందితో వీరమల్లు షూటింగ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ”హరి హర వీరమల్లు”. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. భారీ సెటప్ తో పవన్ కళ్యాణ్ తో పాటుగా మిగతా తారాగణం అంతా పాల్గొనే యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ కు సంబంధించిన విశేషాలను చిత్ర బృందం వెల్లడించింది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ శరవేగంగా సాగుతోందని తెలియజేసారు.

“చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు పరిశోధన వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది”

“పవన్ కళ్యాణ్ గారితో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ ఒక మైలురాయి చిత్రం అవుతుందని.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము”

“వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం” అని ‘హరి హర వీరమల్లు’ మేకర్స్ తెలిపారు.

కాగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు – కుతుబ్ షాహీల కాలానికి సంబంధించిన చారిత్రక కథాంశంతో.. ఒక బందిపోటు వీరోచిత గాథతో ”హరి హర వీరమల్లు” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతినాయకుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నట్లు సమాచారం. ఔరంగజేబు సోదరి రోషనారా పాత్రలో నర్గిస్ ఫక్రి.. స్పెషల్ సాంగ్ లో పూజిత పొన్నాడ కనిపించనున్నారు.

‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పలు భారతీయ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది.