జగన్‌ వర్సెస్‌ కేసీఆర్‌: నీళ్ళ మంటల్లో నిజమెంత.!

నీళ్ళలో నిప్పులు పుట్టించడం.. అనే మాట పెద్దలు తరచుగా ఉపయోగిస్తుంటారు. అవకాశం లేకపోయినా వివాదాలు సృష్టించడమన్నమాట.. దానర్థం. తెలుగు రాష్ట్రాల మధ్య కొత్తగా తెరపైకొచ్చిన నీళ్ళ పంచాయితీ కూడా అలానే వుంది. రాయలసీమకు నీటిని కృష్ణా నది నుంచి ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ప్రాజెక్టుని చేపడుతోంది. అది అదనంగా తోడే ప్రక్రియ కాదు.. తమకున్న వాటాని సమర్థవంతంగా వాడుకునేందుకోసం.. అన్నది ఆంధ్రప్రదేశ్‌ వాదన. కానీ, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ఆలోచనల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ

క్రమంలో ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులపై నానా యాగీ జరుగుతోంది.. అయితే, ఇదంతా పొలిటికల్‌ యాగీ మాత్రమేనన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, అటు తెలంగాణలోనూ అధికార పార్టీలు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ ‘నీళ్ళల్లో నిప్పులు పుట్టించే కార్యక్రమానికి’ తెరలేపాయని వివిధ రాజకీయ పార్టీలు విమర్శిస్తున్న విషయం విదితమే.

ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ముఖాముఖి తలపడనున్నారు.. తమ తమ రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడబోతున్నారు.. అయితే, ఇదంతా ఆన్‌లైన్‌ వేదికగా జరిగే వ్యవహారమనుకోండి.. అది వేరే సంగతి. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఈనాటివి కావు. ఉమ్మడి రాష్ట్రంలోనూ పంచాయితీ నడిచింది. ఆ తర్వాతా నడిచింది.. ఇప్పుడూ నడుస్తూనే వుంది. ‘నీటి వివాదాలు పరిష్కరించుకుంటాం..’ అంటూ అన్నదమ్ముల ‘రాజకీయాన్ని’ తెరపైకి తెచ్చిన కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌.. ఇప్పుడెందుకు ఇలా తలపడేందుకు సిద్ధమవుతున్నారు.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నేమీ కాదు. ఇందులో రాజకీయం సుస్పష్టం.

నీటిని రైతు ప్రయోజనాల కోసం డైవర్ట్‌ చేయడం సంగతెలా వున్నా, తమ తమ రాష్ట్రాల్లో పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకోసమే ఈ డ్రామా.. అన్నది సర్వత్రా విన్పిస్తోన్న వాదన. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్‌ అన్ని సందర్భాల్లోనూ నష్టపోతూనే వుంది. కాస్తో కూస్తో లబ్ది తెలంగాణకే చేకూరుతోంది. ఏళ్ళు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్‌, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోలేకపోతోంది. అదే తెలంగాణ విషయానికొస్తే.. ఆ పరిస్థితి లేదు. మీడియాలో తెలంగాణ వర్సెస్‌ ఎపీ.. అంటూ చాలా కథనాలొస్తున్నాయి.. మంత్రులు మాట్లాడుతున్నారు.. ఆయా పార్టీల నేతలూ విమర్శించుకుంటున్నారు.. అంతిమంగా రాష్ట్రానికి ప్రయోజనమైతే జరగడంలేదు. ఇదీ, ఈ నీళ్ళ మంటల్లో కనిపిస్తున్న రాజకీయ చిత్తశుద్ధి.!