తొలి చిత్రంలోనే తెలంగాణ అమ్మాయిలా నటించింది

ఫేస్‌ చూస్తే మన పక్కింటి అమ్మాయిలా ఉంది కదూ! లాగా ఏంటి, ఈ అమ్మాయి తెలుగమ్మాయే.. సింగర్‌గా శభాష్‌ అనిపించుకుంది. మోడల్‌గా అందంతో మైమరపించింది. ఇప్పుడు తొలిచిత్రంలో అచ్చమైన తెలంగాణ పోరిలా నటించి, అందరినీ మెప్పిస్తోంది గౌరి. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్‌లోనే. తల్లిదండ్రులు యెన్నం శ్రీనివాసరెడ్డి, వసుంధరల ఏకైక సంతానం. 2019లో బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ విమెన్స్‌ కాలేజ్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ పూర్తి చేసింది.

చిన్నప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే గౌరి.. కొంతకాలం యాంకర్‌గా చేసింది. య్యూటూబ్‌ చానెల్‌ ‘చాయ్‌ బిస్కట్‌’లో పలు షార్ట్‌ మూవీస్‌లో నటించింది. అంతేకాదు, నిర్మలా కాన్వెంట్, మనలో ఒక్కడు, ఫిదా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది.

దశాబ్దం పాటు కర్ణాటక సంగీతం, లలిత సంగీతం నేర్చుకుంది. పలు సంగీత పోటీ ల్లో పాల్గొని విజయం కూడా సాధించింది. అలా ‘బోల్‌ బేబీ బోల్‌ సీజన్‌–3’, ‘రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ సీజన్‌–2’ టైటిల్స్‌ సొంతం చేసుకుంది. 2015లో ‘హోరాహోరీ’ సినిమాలో ఒక పాట పాడి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దానికి ‘మిర్చి మ్యూజిక్‌ అవార్ట్స్‌ బెస్ట్‌ డెబ్యూ సింగర్‌’ అవార్డుకు నామినేట్‌ అయ్యింది. సినిమాల్లోకి సింగర్‌గా ఎంట్రీ ఇచ్చినా, ఎప్పుడూ నటించలేదు. అయితే, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న రోజుల్లో, ప్రముఖ వ్యాపార సంస్థ ‘ట్రెండ్స్‌’ నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొంది. అప్పుడు గెలిచిన ‘మిస్‌ హైదరాబాద్‌ 2018’ టైటిల్‌ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం వహించిన ‘మెయిల్‌’ చిత్రంలో లీడ్‌రోల్‌ అవకాశం దక్కింది. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ చిత్రంలో అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా నటించింది.

మిస్‌ హైదరాబాద్‌ తుది పోటీల్లో ‘నువ్వు టైటిల్‌ విన్‌ అవుతావా? లేదా ఏదైనా మూవీలో యాక్ట్‌ చేస్తావా?’ అని ప్రశ్న సంధిస్తే.. టైటిల్‌ గెలిస్తే అన్నీ వస్తాయి కదా! అంటూ బదులిచ్చాను. ఇప్పుడు అదే నిజమైంది.