ఇంకా రెండవ చిత్రమైతే మొదలు కాలేదు కానీ అఖిల్‌కి ఫాలోయింగ్ విషయంలో లోటు లేదు. మొదటి సినిమా ఫ్లాప్ అయినా అతడి ఫాలోయింగ్ పెరుగుతూనే వచ్చింది. ట్విట్టర్లో పది లక్షల మంది ఫాలోవర్లు వున్న అఖిల్ ఎల్లవేళ్లలా యాక్టివ్‌గా వుంటాడు. తన గురించిన సంగతులు చెబుతూ, తనపై వచ్చే వదంతులని ఖండిస్తూ, నచ్చిన సినిమాలని మెచ్చుకుంటూ, తనకిష్టమైన క్రికెట్‌పై అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియాలో సదా బిజీగా వుంటాడు. పది లక్షల మంది ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా తనని ఫాలో అయ్యే వాళ్లకి, ప్రత్యేకించి తను సాధిస్తానని నమ్మేవాళ్లకీ అఖిల్ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నమ్మేవాళ్లలో నేనున్నానంటూ సమంత అతడికి రిప్లయ్ ఇచ్చింది. దానికి అఖిల్ థాంక్యూ వదినా అంటూ సమాధానమివ్వడం అందరినీ ఆకట్టుకుంది. అన్నయ్యకి కాబోయే భార్యని పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై వరసపెట్టి సంబోధించడం అతని అభిమానుల్ని, సమంత ఫాన్స్‌ని బాగా మెప్పించింది. ఈ బిలీవర్స్ ట్వీట్ వెనుక ఇంకో ఆంతర్యముందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తనతో బ్రేక్అప్ చెప్పిన ఫియాన్సేకి అఖిల్ ఇలా ఇన్‌డైరెక్టుగా చురక వేసాడంటూ చెప్పుకుంటున్నారు. అందులో వాస్తవమెంత అనేది పక్కనపెడితే నిశ్చితార్ధం తర్వాత పెళ్లి కాన్సిల్ అయినప్పటికీ అఖిల్ త్వరగానే కోలుకుని రొటీన్లో పడిపోవడంతో ఫాన్స్ ఖుషీగా వున్నారు.