బాహుబలి టీం ‘2.0’ టీంను టార్గెట్ చేసుకుందా?

మొన్నటిదాకా ‘బాహుబలి’ బడ్జెట్ రూ.250 కోట్లని అనుకుంటూ ఉన్నారందరూ. కానీ సినిమా మీద అంచనాలు పెరిగినట్లుగానే దీని బడ్జెట్ కూడా పెరిగిపోయింది. 250 కోట్లకు ఇంకో 200 కోట్లు కలిపి రెండు పార్టులకు కలిపి ఏకంగా రూ.450 కోట్లు ఖర్చయినట్లుగా వెల్లడించి పెద్ద షాకే ఇచ్చాడు నిర్మాతల్లో ఒకడైన శోభు యార్లగడ్డ. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలయ్యే సమయానికి కూడా బడ్జెట్ రూ.250 కోట్లే అన్న శోభు.. ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్లు పెంచేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

మరి అదనంగా చెబుతున్న ఈ 200 కోట్లు రెండో భాగానికే ఖర్చు చేశారా..? అంతకుముందు చెప్పిన బడ్జెట్ అని చెప్పిన రూ.250 కోట్లలో ఓ వంద కోట్లయినా రెండో భాగం కోసం పక్కన పెట్టారు అనుకుంటే.. దీని వరకే రూ.300 కోట్లు ఖర్చు చేశారా…? తొలి భాగం తీస్తున్నపుడే రెండో భాగానికి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తి చేసేసిన జక్కన్న.. మిగతా 60 శాతానికి అంత ఖర్చు పెట్టించేశాడా..? ఇలా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.

చూస్తుంటే బాహుబలి నిర్మాత బడ్జెట్ గురించి కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెబుతున్నట్లే ఉంది. మధ్యలో ఆదాయపు పన్ను అధికారుల కళ్లు పడ్డ నేపథ్యంలో.. ఖర్చు కొంచెం ఎక్కువ చేసి చూపిస్తున్నారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ ఫిలింగా ‘2.0’కు రికార్డు వెళ్లడం ఇష్టం లేక.. దాని కంటే ఓ యాభై కోట్లు ఎక్కువ చేసి చెప్పారా అన్న అనుమానాలూ లేకపోలేదు.