ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న.. ఓ పనైపోయిందంతే.!

ఇక ఇప్పుడు అధికారికం. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు. 2019 ఎన్నికల సమయంలోనే అచ్చెన్న పేరు టీడీపీ ఏపీ అధ్యక్షుడి పదవి రేసులోకి వచ్చింది.. కానీ, కొన్ని కారణాలతో ఆ నియామకం ఆలస్యమవుతూ వచ్చింది. అచ్చెన్నకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి దక్కబోతుందన్న వార్త బయటకు పొక్కాక, ఎలాగైనా ఆయన్ని దెబ్బకొట్టాలనుకున్న వైసీపీ, అత్యంత వ్యూహాత్మకంగా ఆయన్ని ‘ఈఎస్‌ఐ స్కాం’లో ఇరికించిన విషయం విదితమే.

వైసీపీలోకి అచ్చెన్నను లాగేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది.. ఈ క్రమంలోనే బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు షురూ అయ్యాయి. అచ్చెన్న లొంగలేదు.. ఈఎస్‌ఐ స్కాంలో ఆయన పేరు తెరపైకొచ్చింది.. ఆయన జైలుకెళ్ళారు.. జైలు నుంచి ఇటీవల బెయిల్‌ మీద విడుదలయ్యారు కూడా. మరోపక్క, అచ్చెన్నకు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే విషయమై చంద్రబాబు కూడా నానా రకాల పొలిటికల్‌ డ్రామాలకూ తెరలేపారు. చివరికి ఆయన నియామకం ఇప్పటికి ఖరారయ్యింది అధికారికంగా.

ఇక, ఇటీవల టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించడం గమనార్హం. టీడీపీకి గుడ్‌ బై చెప్పబోతున్నారంటూ ఆమెపై ఈ మధ్య చాలా కథనాలు మీడియాలో దర్శనమిచ్చాయి. మరో టీడీపీ సీనియర్‌ నేత ప్రతిభా భారతి పరిస్థితి కూడా ఇంతే. ఆమెకి కూడా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా అవకాశమిచ్చారు చంద్రబాబు. ఇవన్నీ డ్యామేజ్‌ కంట్రోల్‌ చర్యలేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాగా, తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిలో ఎలాంటి మార్పూ లేకపోవడం గమనార్హం. ఎల్‌ రమణను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరగ్గా, ఆ సాహసం పార్టీ అధినేత చంద్రబాబు చేయలేదు. ఇదిలా వుంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్‌ని కొనసాగించిన చంద్రబాబు, లోకేష్‌తోపాటు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర యాదవ్‌, తదితరుల్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

పొలిట్‌ బ్యూరోలోకి బాలకృష్ణ, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, గోరట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమా తదితరుల్ని తీసుకొచ్చారు చంద్రబాబు. ఇదిలా వుంటే, దాదాపు 60 శాతం ముఖ్యమైన పదవుల్ని బీసీలకే ఇచ్చినట్లు టీడీపీ నేతలు చెబుతుండడం గమనార్హం. నిన్ననే 56 బీసీ కార్పొరేషన్లను వైఎస్‌ జగన్‌ ప్రకటించగా, ఇప్పుడు టీడీపీ కూడా బీసీ కార్డుని తెరపైకి తెచ్చింది. ‘మొత్తంగా టీడీపీలోని కీలక విభాగాల ప్రక్షాళన..’ అంటూ టీడీపీ చెప్పుకుంటోందిగానీ.. ఆయా పదవుల్లో ఎవరెవరు ఎంతెంత కాలం వరకు మాత్రమే వుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.