‘ఆచార్య’ వాయిదా వేసే అవకాశం..!

మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా ను వచ్చే నెల 13వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయట. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా భారీ ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. రాబోయే నాలుగు అయిదు వారాలు చాలా కీలకం అంటూ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీ నియమంను అమలు చేయడం లేదంటే నిబంధనలు మరింతగా కఠినం చేసే అవకాశం ఉంది.

ఆచార్య సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. చిరంజీవి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువగా వస్తారు. కాని కరోనా ఈ రేంజ్‌ లో ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ సినిమాకు వచ్చేందుకు ఆసక్తి చూపించరు. దాంతో ఆచార్య సినిమా వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సినిమా విడుదలను వాయిదా వేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేయబోతున్నారు. షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత విడుదల విషయమై ఈనెల చివరి వరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎక్కువ శాతం అయితే సినిమాను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.