ఈ టైటిలేంటో… ఈ గోలేంటో

అక్కినేని అఖిల్ తొలి సినిమా విషయంలో మొదట్నుంచి చాలా సస్పెన్స్ నడిచింది. చాలా కథలు.. చాలామంది దర్శకుల పేర్లు పరిశీలించాక.. వెలిగొండ శ్రీనివాస్ కథతో వినాయక్ దర్శకత్వంలో సినిమా చేశాడు అఖిల్. ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారనే విషయంలో కూడా చాలా డిస్కషన్ నడిచింది. తన పేరునే ఆ సినిమాకు పెట్టుకుని ఆశ్చర్యపరిచాడు అక్కినేని కుర్రాడు. ఆ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చిందో తెలిసిందే.

దీని తర్వాత తన రెండో సినిమా విషయంలోనూ అఖిల్ పెద్ద సస్పెన్స్ డ్రామా నడిపించాడు. ఎట్టకేలకు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను ఏప్రిల్ 1న మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తన తొలి సినిమా తరహాలో సినిమా పూర్తయ్యే దశలో టైటిల్ ఫిక్స్ చేయాలనుకోవట్లేదు అఖిల్. రెగ్యులర్ షూటింగ్ మొదలవడానికి ముందే దీనికి టైటిల్ కన్ఫమ్ చేసేస్తున్నట్లు సమాచారం.

విక్రమ్ కుమార్ సినిమాలన్నీ చాలా వైవిధ్యంగా ఉంటాయి. అలాగే టైటిళ్లు కూడా. అఖిల్ సినిమా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ చిత్రానికి ‘జున్ను’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ టైటిల్‌ను ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేయించారట. మరి ఈ ‘జున్ను’ అనే టైటిలేంటో.. దీనికి కథకు ఏం సంబంధమో తెలియట్లేదు. విక్రమ్ టైటిళ్ల వెనుక ఏదో ఒక మర్మం లేకుండా ఉండదు. కాబట్టి ‘జున్ను’ పేరు పెట్టాలనుకోవడం వెనుక కూడా ఒక కథ ఏదో ఉంటుంది. ఆ కథేంటో చూద్దాం మరి.