బన్నీ సినిమా.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే తొలిసారి

హిందీ జనాలకు ఇదేం పిచ్చో అర్థం కాదు. దక్షిణాదిన ఏదైనా మాస్ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తే చాలా విరగబడి చూసేస్తున్నారు. అది హిట్ సినిమానా.. ఫ్లాప్ సినిమానా అన్నది సంబంధం లేదు. మాస్ అంశాలుండి.. భారీ యాక్షన్ ఘట్టాలుంటే ఆ చిత్రానికి వ్యూస్ పంట పండినట్లే. మన దగ్గర పెద్దగా హిట్లు లేని బెల్లంకొండ శ్రీనివాస్ కూడా వాళ్ల దృష్టిలో పెద్ద సూపర్ స్టార్ అన్నట్లే.

అతడి సినిమాలకు కూడా అక్కడ కోట్లల్లో వ్యూస్ వస్తాయి. ఇక అల్లు అర్జున్ లాంటి మాస్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పేదేముంది? అతడి సినిమాలకు పదుల కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దువ్వాడ జగన్నాథం, సరైనోడు సినిమాలు పోటాపోటీగా వ్యూస్ సాధించాయి.

ముఖ్యంగా ‘సరైనోడు’ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రిలీజ్ చేస్తే.. వ్యూస్, లైక్స్ మోత మోగిస్తూ దూసుకెళ్లింది. ఇప్పటికే యూట్యూబ్ వ్యూస్ విషయం కొత్త కొత్త రికార్డులు నెలకొల్పుతూ వెళ్లిన ఆ చిత్రం.. ఇప్పుడు ఏకంగా 30 కోట్ల వ్యూస్ మార్కును అందుకుంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే యూట్యూబ్‌యే కాదు.. మరే మాధ్యమంలోనూ ఇన్ని వ్యూస్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు.

హిందీలో.. ఏకంగా 30 కోట్ల మంది ఈ సినిమా చూడటమంటే మాటలా? దీన్ని బట్టి ఉత్తరాది జనాలు బన్నీ సినిమాలంటే ఎలా పడి చస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ హీరోలు మాస్ సినిమాలు మానేసి క్లాస్ మంత్రం పఠిస్తుండటంతో బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మాస్ ప్రేక్షకులు తెలుగు నుంచి వచ్చే డబ్బింగ్ మాస్ సినిమాల పని పడుతున్నారు. జియో పుణ్యమా అని రోజుకు జీబీల్లో ఇంటర్నెట్ చౌకగా వస్తోంది. దీంతో వాళ్లు మన సినిమాలకు ఇలా కోట్లల్లో వ్యూస్ ఇస్తున్నారు.