‘పుష్ప’ స్పెషల్‌ సాంగ్‌లో బాలీవుడ్‌ భామ!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియోటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మండన్న నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్‌ తొలిసారి పూర్తిస్థాయి మాస్‌ రోల్‌లో మెప్పించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.

కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించేందుకు బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతేలాని చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఊర్వశి సైతం వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీ తర్వాత బన్నీ కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చే ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.