25 ఏళ్ల ‘అమ్మోరు’.. ఇండియాలో తొలి కంప్యూటర్ గ్రాఫిక్స్ మూవీ

కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సినీ మేకర్స్ ముందుంటారు. బడ్జెట్ పరిమితులు దాటి వండర్స్ చేస్తారు. అలాంటి సినిమాలు గేమ్ చేంజర్స్ అవుతాయి. తెలుగులోనూ అటువంటి సినిమాలు ఉంటాయి. చిరంజీవి ‘ఖైదీ’ తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములానే మార్చేసింది. నాగార్జున ‘శివ’తో ఇండియన్ ఫిలిం మేకింగ్ మారిపోయింది. రామ్ చరణ్ ‘మగధీర’ తెలుగు సినిమా బడ్జెట్ పరిమితులు మార్చేసింది. ఇలా తెలుగు సినిమా భారతీయ సినిమాను అనేకసార్లు ప్రభావితం చేసింది. ఈ తరహాలోనే దేశంలో తొలి కంప్యూటర్ గ్రాఫిక్స్ సినిమాను తెరకెక్కించి పెను విప్లవాన్ని సృష్టించింది. ఆ సినిమానే ‘అమ్మోరు’. 1995 నవంబర్ 23న విడుదలైన ఆ సినిమాకు 25 ఏళ్లు పూర్తయ్యాయి.

ఎంఎస్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆలోచనలే ఇండియన్ సినిమా గేమ్ చేంజింగ్ కు కారణమైంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘అమ్మోరు’.. ఓ భక్తురాలికి, దేవతకు మధ్య కథ. ఈ తరహా కధలు గతంలో వచ్చినా.. ఈసారి మ్యాజిక్ చేయాలని ఫిక్స్ అయ్యారు శ్యామ్. హాలీవుడ్ లో ఉన్న కంప్యూటర్ గ్రాఫిక్స్ ను ఈ సినిమాకు ఉపయోగించారు. బడ్జెట్ ఎక్కువైనా వెనుకడుగు వేయలేదు. గ్రీన్ మ్యాట్స్, డిజిటల్ ఫిలిం మేకింగ్ లేని రోజుల్లో.. రీల్ తోనే సీజీకి కావాల్సిన సన్నివేశాలు షూట్ చేశారు. వీటికి లండన్ లో గ్రాఫిక్ వర్క్స్ చేయించారు శ్యాంప్రసాద్ రెడ్డి. మొదట వేరే దర్శకుడితో కొంత భాగం తీసి.. అనుకున్న విధంగా రాకపోయేసరికి కోడి రామకృష్ణను దర్శకుడిగా తీసుకొచ్చారు.

సినిమా విడుదలైంది. అప్పటివరకూ ప్రేక్షకులు తెరపై చూడని అద్భుతాన్ని చూశారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ‘అమ్మోరు’గా రమ్మకృష్ణ చూసి ప్రేక్షకులు దణ్ణాలు పెట్టేశారు. దేవతనే చూసుకున్నారు. మహిళలు హారతులు పట్టారు. ‘అమ్మోరు’గా రమ్యకృష్ణ ఎంట్రన్స్ సీన్ ఒళ్లుగగుర్పొడిచేలా చేసింది. సినిమా చూస్తున్న ఎందరో మహిళలకు పూనకాలే వచ్చాయి. నీళ్లలో నుంచి చేయి వచ్చి అమ్మోరును కాపాడే సీన్ సినిమాకే హైలైట్. గ్రాఫిక్స్ లో కోడి రామకృష్ణ – శ్యాంప్రసాద్ చేసిన మాయాజాలాన్ని ప్రేక్షకులు అమితాశ్చర్యంతో చూశారు. ప్రతిచోటా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్. ధియేటర్ల ఆవరణల్లో ‘అమ్మోరు’ గుళ్లే వెలిసాయి.

అంతటి అద్భుతాలు చేసింది ‘అమ్మోరు’. దీంతో భారతీయ సినిమాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ విప్లవం మొదలైంది. గ్రాఫిక్స్ లో జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది. ఇప్పటి టెక్నాలజీలో ‘అవతార్’ ఎంత అద్భుతమో.. 25 ఏళ్ల క్రితం అప్పటి గ్రాఫిక్స్ తో ‘అమ్మోరు’ ఆ స్థాయి సినిమా అంటే ఆశ్చర్యం లేదు.