అనసూయ సెగలు మామూలుగా లేవుగా

ఇంతకుముందు ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఐటెం సాంగ్ చేయమంటే నో అంది అనసూయ. ఇది జస్ట్ రూమరేమో అనుకున్నారంతా. కానీ ఈ పాట చేయమంటే తిరస్కరించిన మాట వాస్తవం అంటూ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది అనసూయ. ఆ తర్వాత అల్లు అర్జున్ మీద ఆమె చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. తాజాగా ‘విన్నర్’ సినిమాలో తాను చేసిన ఐటెం సాంగ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తన పేరు మీద పాట రాశారు కాబట్టే ఇందులో స్టెప్పులేసిందట అనసూయ. పాట లిరిక్స్ మొత్తం వినిపించాక కానీ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.

అంతే కాదు.. ఐటెం సాంగ్స్‌ను ఆ పేరుతో పిలవడం పట్ల కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘క్షణం సినిమా తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవీ నన్ను ఎగ్జైట్ చేయలేదు. అందుకే ఒప్పుకోలేదు. నాకు అసలు ఐటెం సాంగ్స్ చేసే ఉద్దేశం లేదు. అయితే విన్నర్ టీం ముందు నాకు పాట వినిపించింది. లిరిక్స్ మొత్తం విన్నాను. నా పేరు మీదే పాట రాయడం.. పాట మొత్తం సరదాగా ఉండటంతో ఓకే చేశాను. నేను చేసిన ఈ పాటను స్పెషల్ సాంగ్ అంటాను. అంతే తప్ప అది ఐటెం సాంగ్ కాదు. ‘ఐటెం’ అనడానికి మేమేమైనా వస్తువులమా. ఆర్టిస్టులం. ఇదంతా బాలీవుడ్ వాళ్ల ప్రభావం వల్ల వచ్చింది. నా దృష్టిలో వీటిని ఐటెం సాంగ్స్ అనకూడదు. స్పెషల్ సాంగ్స్ అనాలి’’ అంటూ వగలు పోయింది అనసూయ.