పూరి మాటలు నమ్మొచ్చా?

రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు బయట పెద్దగా మాట్లాడేవాడు కాదు. అతడి సినిమాలే మాట్లాడేవి. కానీ ఎప్పుడైతే వర్మ మాట్లాడటం మొదలుపెట్టాడో.. అతడి సినిమాలు మాట్లాడ్డం మానేశాయి. సినిమా విడుదలకు ముందు వర్మ చేసే పబ్లిసిటీ స్టంట్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏవో మాటలు చెప్పి.. ఏవో వివాదాలు రాజేసి.. సినిమాకు హైప్ తీసుకురావడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఐతే అలాంటి స్ట్రాటజీలు ఈ మధ్య పని చేయట్లేదు. వర్మ మీద జనాలకు పూర్తిగా నమ్మకం పోయింది.

ఇప్పుడు వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. తన సినిమాలు రిలీజయ్యేు ముందు.. తర్వాత వాటి రీమేక్స్ గురించి.. సీక్వెల్స్ గురించి కబుర్లు చెప్పడం పూరికి అలవాటు. బిజినెస్ మేన్.. టెంపర్.. జ్యోతిలక్ష్మీ.. లాంటి సినిమాల విషయంలో ఇలాంటి ముచ్చట్లే చెప్పాడు పూరి. కానీ ఈ సినిమాలేవీ కూడా రీమేక్ అవ్వలేదు. వాటికి సీక్వెల్సూ రాలేదు. ఇప్పుడు తన కొత్త సినిమా ‘రోగ్’ విషయంలోనూ ఇలాగే మాట్లాడుతున్నాడు పూరి.

కన్నడ కుర్రాడు ఇషాన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘రోగ్’ సినిమాకు తెలుగులో ఏమంత క్రేజ్ లేదు. పూరి వరుసగా హ్యాట్రిక్ ఫ్లాపులు (జ్యోతిలక్ష్మీ, లోఫర్, ఇజం) ఇవ్వడం.. హీరో మనకు పరిచయం కూడా లేకపోవడంతో ‘రోగ్’ను మన జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పూరి తనదైన శైలిలో ప్రమోషన్ మొదలుపెట్టేశాడు. సల్మాన్ ఖాన్ ‘రోగ్’ కథ విని ఫిదా అయిపోయినట్లు చెబుతున్నాడు. ‘రోగ్’ కథ నచ్చేసి ఈ చిత్రాన్ని సూరజ్ పంచోలి హీరోగా రీమేక్ చేయడానికి సల్మాన్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా చెప్పాడు పూరి.

దీంతో పాటుగా సల్మాన్‌కు ఇంకొన్ని కథలు కూడా చెప్పానని.. వాటిలో ఏది సెలక్ట్ చేసుకోవాలా అని సల్మాన్ ఆలోచిస్తున్నట్లు కూడా చెప్పాడు పూరి. ఐతే ఇంతకుముందు పూరి చెప్పిన మాటలేవీ నిజమైన దాఖలాలు లేవు కాబట్టి ‘రోగ్’ విషయంలో చెబుతున్న కబుర్లు కూడా నమ్మశక్యంగా అనిపించట్లేదు. సల్మాన్ ఫిదా అయిపోయాడంటే ‘రోగ్’ ఎంత గొప్పగా ఉంటుందో అని జనాలు అనుకుంటారేమో అని పూరి ఆలోచన కావచ్చు. ఇలాంటి మాటలు చెప్పినంత మాత్రాన ‘రోగ్’కు హైప్ వచ్చేయదు. ట్రైలర్ ఏమైనా ఇంప్రెస్ చేస్తే తప్ప పరిస్థితి మారకపోవచ్చు.