ఆ ఏడు లక్షలు.. ఇప్పుడు 400 కోట్లంటున్న దత్

చేతిలో డబ్బుండి.. స్థలాలు చౌకగా వస్తున్నపుడు ఊరికే ఉండిపోయి.. ఇప్పుడు అసాధారణంగా పెరిగిపోయిన రేట్లు చూసి చింతించడం మామూలే. టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్వనీదత్ కూడా ఇప్పుడు కొంత వరకు ఇలాగే ఫీలవుతున్నాడు. 70ల్లో భారీగా డబ్బులు పట్టుకుని చెన్నైలో అడుగుపెట్టి.. నిర్మాతగా ఒక్కో అడుగు వేస్తూ అగ్రస్థాయికి ఎదిగాడు దత్. ఐతే అప్పుడు తాను సినిమాల్లో పెట్టిన పెట్టుబడిని భూమిపై పెట్టి ఉంటే తన రేంజే వేరుగా ఉండేదని ఆయనంటున్నాడు.

“మా నాన్నగారు అప్పట్లోనే ఎ-1 కాంట్రాక్టర్‌గా ఉండేవారు. నేను ఇంజినీరింగ్ చదువు మధ్యలో మానేసి సినిమాల వైపు ఆకర్షితుడినయ్యాను. సినీ నిర్మాణాన్ని కూడా వ్యాపారం లాగే చేద్దామని మా నాన్నను కన్విన్స్ చేసి.. డబ్బుతో చెన్నై వెళ్లాను. ఆ రోజుల్లోనే మా నాన్నగారు ఒక ప్యాకెట్లో ఏడు లక్షల రూపాయలిచ్చారు. అది 1974లో మాట. ఆ డబ్బులు తీసుకుని మద్రాసు వెళ్లాక ఎంఎస్‌రెడ్డి గారితో మాట్లాడుతూ ఇలా ఏడు లక్షలు తీసుకొచ్చానని చెప్పాను. ఆయన నా వైపు చూసి.. ‘నీ దుంపతెగా.. టీనగర్‌లో గ్రౌండ్‌ఎంతో తెలుసా? 4800 రూపాయలు. నువ్వు తెచ్చిన డబ్బులతో ఎంత భూమి వస్తుందో తెలుసా’ అన్నారు. అప్పటికి ఆయన రియల్‌ ఎస్టేట్‌లోనూ ఉండేవాళ్లు. నిజంగా ఆ డబ్బులతో ఆయన చెప్పినట్లు చేసి ఉంటే 125 గ్రౌండ్స్‌ వచ్చుండేవి. ఇప్పుడు వాటి విలువ రూ.400 కోట్లుండేది. ఐతే సినిమాల్లో బాగానే విజయవంతమయ్యాను. మా నాన్న నాకిచ్చిన ఏడు లక్షలు కూడా వెనక్కిచ్చాను. వాటితో చాలా భూములు డెవలప్ చేశా. గన్నవరం దగ్గర నేను 30 ఎకరాలు కొన్నాను” అని దత్ చెప్పాడు.