దిల్‌ రాజుపై అలక, 30 కోట్ల లాభం

‘బాహుబలి 1’ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేసిన దిల్‌ రాజు ‘బాహుబలి 2’ డిస్ట్రిబ్యూట్‌ చేయడానికి కూడా ఉత్సాహం చూపించాడు. అయితే ‘బాహుబలి’ మొదటి భాగం లావాదేవీల్లో ఆర్కా మీడియా వారితో దిల్‌ రాజుకి చిన్న పేచీ వచ్చింది. దాంతో రెండవ భాగాన్ని అతడికి ఇవ్వకూడదని డిసైడయ్యారు.

మొదటి భాగం నైజాంలో నలభై కోట్లు షేర్‌ సాధిస్తే, రెండవ భాగానికి అదే రేట్‌ కోట్‌ చేసారు. అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి నైజాంలోని బయ్యర్లెవరూ ధైర్యం చేయలేకపోయారు. ఇస్తే దిల్‌ రాజుకివ్వాలి, లేదంటే సొంతంగా విడుదల చేసుకోవాలనే పరిస్థితి వచ్చినపుడు సొంతంగా విడుదల చేయడానికే మొగ్గు చూపారు. ఏషియన్‌ ఫిలింస్‌ ద్వారా నైజాంలో బాహుబలి 2ని ఆర్కా మీడియా స్వయంగా విడుదల చేసింది. ఈ చిత్రానికి నలభై కోట్లు రావాల్సిందల్లా ఇప్పుడు డెబ్బయ్‌ కోట్ల షేర్‌ వస్తోంది.

నిజానికి నలభై కోట్ల రేట్‌ చెబితే దిల్‌ రాజు అవుట్‌ రైట్‌కి అడిగేసేవాడు. మంచి డీలే కదా అని ఓకే చెప్పేవారు. కానీ నైజాంలో డెబ్బయ్‌ కోట్ల మార్కెట్‌ వుందని ఇప్పుడు తెలుసుకున్నారు. అలా దిల్‌ రాజుపై అలక వల్ల బాహుబలి నిర్మాతలకి అదనంగా ముప్పయ్‌ కోట్ల లాభం వచ్చింది. అదండీ సంగతి.