ట్రంప్ కు షాకిచ్చిన సొంత పార్టీ నేతలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది. సెనేట్‌లో ప్రవేశపెట్టిన ఒబామా కేర్ రద్దు తీర్మాన బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. దీనికి సొంతపార్టీ సెనేటర్లే కారణమంటూ ట్రంప్ ఫైరవుతున్నారు. తమ రిపబ్లికన్ సభ్యులు కొందరు డెమోక్రాట్లతో  కలసి తనను ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రంప్ కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన ఒబామా  కేర్ ను రద్దు చేస్తానని ట్రంప్ ఆది నుంచి చెప్పుకొస్తున్నారు. తన ఎన్నికల ప్రచారం నాటి నుంచి ట్రంప్ ఇదే మాట చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు అన్నంత పని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. ట్రంప్ సొంత పార్టీ కూడా ఈ విషయంలో ఆయన్ను వ్యతిరేకించింది. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు సెనేట్ లో ఆ బిల్లు పెట్టినా కూడా ఆమోదానికి నోచుకోలేదు. సెనేట్ లో రిపబ్లికన్లదే మెజార్టీ అయినప్పటికీ ట్రంప్ కోరిక తీరకపోవడంతో ఆయన రగిలిపోతున్నారు.

మరోవైపు వీసాల విషయంలోనూ ట్రంప్ కాస్త వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అక్కడి కంపెనీల వ్యాపార అవసరాల కోసం అదనంగా 15వేల హెచ్-2బీ వీసాలను ట్రంప్  ప్రభుత్వం పెంచింది. తాత్కాలిక ప్రాతిపదికన వెంటనే 15వేల మంది ఉద్యోగులను తీసుకోకపోతే అమెరికాలో వ్యాపారాలు కుదేలయ్యే పరిస్థితి ఉండడంతో ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  పాపం… ఏదీ ఆయన అనుకున్నట్లుగా జరుగుతున్నట్లు లేదు.