2017 బిగ్గెస్ట్ డిజాస్టర్..?

ఒకప్పుడు ‘అన్నమయ్య’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డల్లుగానే మొదలైంది. కానీ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. జనాలు తండోపతండాలుగా థియేటర్లకు తరలి వచ్చారు. సినిమాను చాలా పెద్ద హిట్ చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడంతా ఆరంభ మెరుపుల మీద ఆధారపడి సినిమాలు నడుస్తున్నాయి.

ఇలాంటి టైంలో ‘ఓం నమో వేంకటేశాయ’ అన్ సీజన్లో విడుదలైన అన్యాయమైపోయింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ గట్టి దెబ్బే వేశాయి. సినిమా ఆ తర్వాత పెద్దగా పుంజుకోలేదు. కలెక్షన్లు మరీ డల్లుగా ఉండటంతో ఇది నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యేలా ఉంది.

సెకండ్ వీకెండ్లో ‘ఓం నమో వేంకటేశాయ’ నుంచి అద్భుతాలేమీ ఆశించే పరిస్థితి లేదు. ఈ వీకెండ్లో రాబోతున్న ‘ఘాజీ’ రిలీజ్‌కు ముందే ప్రివ్యూలతో అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. సినిమాపై ఉన్నట్లుండి బాగా హైప్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ‘ఓం నమో వేంకటేశాయ’ రెండో వీకెండ్లోనూ ఓ మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకునేలా ఉంది. ఆ తర్వాతి వారానికి ఒకటికి మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. కాబట్టి ఫుల్ రన్లో నాగ్ మూవీ రూ.15 కోట్ల షేర్ రాబట్టడం కూడా కష్టంగానే ఉంది.

రూ.40 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం పాతిక కోట్లకు తక్కువ కాకుండా నష్టాలు మిగల్చబోతోందన్నమాట. నాగ్ కెరీర్లో డిజాస్టర్లు ఉన్నాయి కానీ.. మరీ ఈ స్థాయిలో నష్టాలు మిగిల్చిన సినిమా ఏదీ ఉండకపోవచ్చు. కాబట్టి వసూళ్ల పరంగా ‘ఓం నమో వేంకటేశాయ’ నాగ్‌కు బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుందేమో.