బ్లూ వేల్ ఆడితే.. మ‌ర్డ‌రేనా?

బ్లూ వేల్ గేమ్ జోలికి వెళ్తే.. చేజేతులా మ‌న‌ల్ని మ‌నం హ‌త్య చేసుకోవ‌డ‌మేన‌ని అంటున్నారు నిపుణులు.  ఎక్క‌డో పాశ్చ్యాత్య దేశాల్లో ఓ బుడ‌త‌డి చేతిలో ప్రాణం పోసుకున్న ఈ గేమ్ ఇప్ప‌టికి వంద‌ల సంఖ్య‌ల ప‌సివాళ్ల ప్రాణం తీసింది. మొద‌లు పెట్ట‌డం ఎంత తేలికో.. ఈ గేమ్ నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డడం అంత క‌ష్టం అట‌!  దీనికి ఉదాహ‌ర‌ణ‌లే ఈ గేమ్ ఆడుతూ మృతి చెందిన వారి సంఖ్య‌. ఈ గేమ్ స‌ర‌దాతో మొద‌లై.. త‌ర్వాత త‌ర్వాత‌.. వ్య‌స‌నంగా మారి.. ఆ త‌ర్వాత ప్ర‌మాద‌పు ప్ర‌యోగాలకు దారితీసి.. అటు పిమ్మ‌ట ప్రాణాల‌ను హ‌రిస్తుంద‌ట‌.

ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్యాలో 130 మంది యువ‌కులు ఈ గేమ్‌ను ఆడి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇక‌, మన దేశంలోని పశ్చిమబంగాలో ఓ పదిహేనేళ్ల బాలుడు తలకు ప్లాస్టిక్‌ కాగితం, మెడ చుట్టూ తువ్వాలు బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లో ఏడో తరగతి విద్యార్థి ఇదే గేమ్‌ ఆడి ఛాలెంజ్‌లో భాగంగా పాఠశాల భవనంపై నుంచి దూకి దుర్మరణం పాలయ్యాడు. మనదేశంలో ఇప్పటివరకు నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అస‌లు ఈ గేమ్‌లో ఏముంటుంది? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది.

బ్లూ వేల్ సూసైడ్ గేమ్ దీని అస‌లు పేరు. పేరులోనే సూసైడ్ ఉన్న‌ట్టుగానే ఈ గేమ్ ఆత్మ‌హ‌త్య‌ల‌ను ప్రేరేపిస్తుంది. అయితే, మ‌రి ఆత్మ‌హ‌త్యల‌ను ప్రేరేపించే గేమ్ ఎందుకు ఆడుతున్న‌ట్టు అంటే.. మీరు సాహ‌స వంతులేనా ? అనే ప్ర‌శ్న‌తో ఈ గేమ్ స్టార్ట‌వుతుంద‌ట‌. అక్క‌డి నుంచి మొద‌లు పెట్టిన ప్ర‌యాణం.. ఆడే వ్య‌క్తి మైండ్‌ను ప్ర‌భావవ‌తం చేస్తూ.. మీలో సాహ‌సానికి కొన్ని ప‌రీక్ష‌లు అంటూ.. ప్రారంభిస్తుంది. చిన్న చిన్న సాహ‌సాల‌తో మొద‌లు పెడుతుంది. ఇంటో ఒంట‌రిగా ఉన్నప్పుడు రాత్రివేళ పూర్తిగా లైట్ల‌న్నీ తీసేసి ఒక్క‌రే ఎలాంటి భ‌యం లేకుండా ప‌డుకోవాలి- వంటి సినిమా సీన్ల వంటి ప్ర‌యోగాల‌తో స్టార్ట్ చేస్తుంది.

మొద‌ట్లో ఈ సాహ‌సాలు చిన్న‌చిన్న‌విగా ఉండ‌డంతో యువ‌త‌ను బాగా ఆక‌ర్షిస్తోంది. దీంతో వారు ఈ గేమ్‌లో అన్ని స్టేజ్‌ల‌ను సునాయాసంగా అధిగ‌మిస్తూ.. చిట్ట‌చివ‌రి రెండో ద‌శ‌కు చేరుకుని ప్రాణాలు కోల్పోతున్న‌ట్టు నిపుణులు గుర్తించారు. చివ‌రి రెండు ద‌శ‌ల్లోనూ భారీస్థాయిలో సాహ‌సాలు ఉండ‌డంతో యువ‌కులు వాటిని చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నార‌ని గుర్తించారు. వీటి నుంచి యువ‌త‌ను ర‌క్షించేందుకు వారికి నెట్ స‌దుపాయం ఉన్న ఫోన్ల‌ను దూరంగా ఉంచాల‌ని సూచిస్తున్నారు. మ‌రి ఆదిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటే మంచిదేమో.