అక్షర హాసన్‌పై బాలీవుడ్‌ మీడియా ఫైర్‌

‘షమితాబ్‌’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కమల్‌హాసన్‌ చిన్న కూతురు, శృతిహాసన్‌ చెల్లెలు అక్షర హాసన్‌ ప్రస్తుతం మరో హిందీ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీగా వుంది. ‘లాలీ కీ షాదీ మే లడ్డూ దీవానా’ అనే చిత్రంతో మరోసారి నటిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న జూనియర్‌ హాసన్‌కి ఇటీవల మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్యం బాలేకపోయినప్పటికీ అక్షర ఒక మీడియా ఇంటరాక్షన్‌కి వచ్చిందట. అయితే అనుకున్న సమయం ంటే ఎక్కువ సేపు అది సాగిందట.

డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ వుండడంతో అక్షర తన ఇంటర్వ్యూలు ముగించకుండానే బయల్దేరిపోయిందట. దాంతో ఆ ప్రెస్‌మీట్‌ ఆర్గనైజ్‌ చేసిన డిస్ట్రిబ్యూటర్‌ ఆమెని వారించాడట. అప్పటికే అనారోగ్యంతో నీరసించిపోయి వున్న అక్షర అతడిపై కేకలు వేసిందట. ఇంటర్వ్యూ పూర్తి చేయకుండా వెళ్లిపోతున్నావేంటని అడిగిన జర్నలిస్ట్‌పై కూడా అరిచిందట. దీంతో అక్షర హాసన్‌కి క్రమశిక్షణ లేదని, పొగరు అని మీడియాలో చాలా కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఈ చిత్రంలో ఆమెకి జంటగా నటించిన వివాన్‌ షా ఆ పరిస్థితుల్లో తానయినా అలాగే రియాక్ట్‌ అయ్యేవాడినంటూ వెనకేసుకుని వచ్చాడు. అలాగే అక్షర కోప్పడిన డిస్ట్రిబ్యూటర్‌ కూడా ఆమె చేసిన దాంట్లో తప్పేమీ లేదని, ఆ సమయంలో ఆమె కాస్త ఆవేశ పడిందని, తర్వాత సారీ చెప్పిందని, మీడియా దీనిని రాద్ధాంతం చేస్తోందని అంటున్నాడు. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్‌తో బాలీవుడ్‌ మీడియా బ్యాడ్‌ బుక్స్‌లోకి ఆమె ఎక్కేసింది. ఈ ఇమేజ్‌ని పోగొట్టుకునేందుకు ఆమె ఎంతగా మీడియాని మచ్చిక చేసుకోవాలో ఏమో. అసలే దక్షిణాది తారలని తొక్కేసే సంస్కృతి వున్న బాలీవుడ్‌లో కెరియర్‌ బిగినింగ్‌లోనే ఇలాంటి సంఘటన ఇబ్బందికరమే.