ఆంధ్రా భవన్ కధ ముగిసినట్టేనా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెల‌కొన్న కొన్ని విభ‌జ‌న స‌మ‌స్య‌లు ఒక్కొక్క‌టిగా కొలిక్కి వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఇందులో కీల‌క‌మైన దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఏపీ ఉమ్మడి భవన్ వ్య‌వ‌హారం సెటిలైన‌ట్లు స‌మాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 48(1) బీ ప్రకారం  42:58 నిష్పత్తిలో పంచుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇరు రాష్ట్రాలకు లేఖ రాసినట్లు సమాచారం. మార్చి 8న లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నా ఇప్పటివరకు అలాంటి లేఖ త‌మ‌కు చేర‌లేద‌ని తెలంగాణ అధికార‌ వ‌ర్గాలు చెప్తున్నాయి.

ఈ జనవరి 12న వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఎలాంటి ఏకాభిప్రాయం రాకపోగా, స్పష్టమైన వివరణ ఇవ్వడానికి రెండు వారాల గడువు ఇవ్వాలని రెండు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు అందాయి. జనవరి 12న వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏపీ భవన్ విభజన గురించి సమావేశం జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలల ప్రతినిధులతో ఢిల్లీలోనే హోంశాఖ కేంద్ర-రాష్ట్ర సంబంధాల సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఎలాంటి స్పష్టతా రాలేదు. అయితే ఆ తర్వాత ఎలాంటి జవాబు రాకపోవడంతో కేంద్రమే పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం నిష్పత్తి ప్రకారం పంచుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికార వర్గాలు మాత్రం ఇప్పటివరకూ తమకు అలాంటి లేఖ అందలేదని చెప్తోంది.

కాగా, ఢిల్లీలోని ఉమ్మడి భవన్‌ను పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ఏపీ వాదిస్తోంది. నిజాం హయాంలో నిర్మాణమైన హైదరాబాద్ హౌస్‌ను కేంద్రం తన స్వాధీనంలోకి తీసుకుని దానికి ప్రత్యామ్నాయంగా 8.77 ఎకరాల భూమిని ఇచ్చినందువల్ల ఈ స్థలం మొత్తం తెలంగాణకే చెందుతుందని తెలంగాణ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ హౌస్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన స్థలం మినహా మిగిలిన స్థలాన్ని మాత్రం రెండు రాష్ట్రాలు పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పంచుకోవచ్చునని, ఆ విధంగా 11 ఎకరాల మేరకు మాత్రమే రెండు రాష్ట్రాల మధ్య నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలంగాణ వాదిస్తోంది. దీంతో వివాదం మొద‌టికి వ‌చ్చిన‌ట్ల‌యింది.