ఐటీ ఉద్యోగాలు ఎలానూ ఇవ్వలేరు.. ఇంటర్నెట్ కూడా ఇవ్వరా: చంద్రబాబు

కోనసీమ ప్రాంతంలోని ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం ఇంకా పునరుద్ధరించకపోవడంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ‘కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే ‘ఇంటర్నెట్ సేవలు నిలిపివేత’ అనే వార్త ను మన సీమలో వినాల్సి రావడం బాధాకరం.

IT వంటి ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం…కనీసం వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చెయ్యడం దారుణం. ఇంటర్ నెట్ అనేది ఇప్పుడు అతి సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలి. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదు.

వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయం. మీ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదు’ అని ట్వీట్ చేశారు. కోనసీమలో యువత, ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు ఇంటర్నెట్ సేవలు లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.