బాలయ్య నర్తనశాల తరహాలో ఆగిపోయిన చిరు సినిమాను విడుదల చేయాలట!

నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించిన నర్తనశాల హీరోయిన్ సౌందర్య చనిపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇన్నేళ్ల తర్వాత బాలయ్య చిత్రీకరించిన సన్నివేశాల వరకూ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూడటానికి 50 రూపాయలు చెల్లించాలి.

ఈ పద్దతి కొంత భాగం చిత్రీకరించి ఆగిపోయిన సినిమాలకు బాగా ఉపయోగపడుతుందని కొంత మంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఆగిపోయిన చిరంజీవి సినిమా విషయంలో ఇదే పద్దతి ఫాలో అవ్వాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి.

చాలా ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా అబు – బాగ్దాద్ గజదొంగ అనే చిత్రాన్ని మొదలుపెట్టారు. కొంత భాగం షూటింగ్ జరిపిన తర్వాత బడ్జెట్ కారణాలు, ముస్లిం కమ్యూనిటీ నుండి వచ్చిన వ్యతిరేకత వంటి అనేక కారణాల కారణంగా షూటింగ్ ను నిలిపివేశారు. సో ఈ సినిమా కోసం చిత్రీకరించిన సన్నివేశాలను విడుదల చేయాలని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఆ పాత్రలో చిరును చూడాలని అనుకుంటున్నారు.

అయితే నర్తనశాల బాలయ్య సొంత సినిమా కాబట్టి ఫుటేజ్ ను అలాగే భద్రపరిచారు. మరి అబు సినిమా ఫుటేజ్ అసలు ఉందా? ఉంటే ఎవరి దగ్గర ఉంది? ఒకవేళ విడుదల చేయాలనుకుంటే ఎవరు చేస్తారు? అసలు చేస్తారా? ఏమో ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.