ఫ్లాష్ బ్యాక్: చిరు ఫాదర్ చిరుతో పాటు కృష్ణ, శోభన్ బాబులతో కలిసి నటించిన సినిమాలేంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. అనితర సాధ్యమైన క్రేజ్, ఇమేజ్ తో మెగాస్టార్ గా, నెంబర్ వన్ హీరోగా తెలుగు సినిమాను ఏలేశారు.. ఏలుతున్నారు. సినిమాలకు తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చినా కమ్ బ్యాక్ మూవీస్ రెండూ 100 కోట్లు షేర్ వసూసు చేయడం విశేషం. ఇంతటి పేరు సంపాదించిన చిరంజీవిని చూసి ఆయన తల్లిదండ్రులు మురిసిపోయారంటే అతిశయోక్తి కాదు. మురిసిపోవడమే కాదు చిరంజీవి తండ్రి వెంకట్రావు పలు సినిమాల్లో నటించిన విషయం తక్కువ మందికే తెలుసు. స్వయంగా చిరంజీవి సినిమాలో నటించారు.

1983లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాలో నటించారు చిరంజీవి. ఈ సినిమాలో అల్లు రామలింగయ్య తన కూతురికి మంత్రి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఆ మంత్రి వేషాన్ని చిరంజీవి తండ్రి వెంకట్రావు గారితో చేయించారు దర్శకులు బాపు. చిరంజీవితో కలిసి స్క్రీన్ షేరింగ్ లేకపోయినా కుమారుడి సినిమాలో నటించాననే తృప్తిని మిగుల్చుకున్నారు. వీటికంటే ముందు చిరంజీవి సినమాల్లోకి రాకముందు పలు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నటించారు వెంకట్రావు.

1969లో కృష్ణ హీరోగా వచ్చిన ‘జగత్ కిలాడీలు’ సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. 1971లో శోభన్ బాబు హీరోగా వచ్చిన ‘జగత్ జంత్రీలు’ సినిమాలో కూడా వెంకట్రావు నటించారు. ఈ సినిమాలో కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కనిపిస్తారు. వృత్తిరీత్యా ఆయన ఎక్సైజ్ శాఖలో ఉద్యోగి. సినిమాలపై ఉన్న మక్కువతో ఈ సినిమాల్లో నటించారు. తర్వాత మరే సినిమాలో నటించకపోయినా.. సినిమాల్లో చిరంజీవి ఎదుగుదల, పేరు ప్రఖ్యాతులు, పవన్ కల్యాణ్ ఎదుగుదలను కుమారుల్లో చూసుకుని మురిసిపోయారు. 2007లో వెంకట్రావు కన్ను మూశారు.