వర్మ మీద చిరు.. ఈసారి ఘాటుగానే

తన మీద.. తన ఫ్యామిలీ మీద విమర్శలు చేసే వాళ్లపై నెమ్మదిగా స్వరం పెంచుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. రామ్ గోపాల్ వర్మ, యండమూరి వీరేంద్రనాథ్‌ల విషయంలో ముందు చాలా లైట్ అన్నట్లు మాట్లాడిన చిరు.. ఇప్పుడు మాత్రం వాళ్లను గట్టిగానే విమర్శిస్తున్నాడు. యండమూరిది ఏం సంస్కారం అంటూ ఆల్రెడీ ఆయనకు కోటింగ్ ఇచ్చాడు చిరు.

ఇప్పుడు టార్గెట్ వర్మ మీదికి మార్చాడు చిరు. వర్మది కుత్సితమైన బుద్ధి అని.. ఉద్దేశపూర్వకంగా ఒకరిని కించపరచాలని ప్రయత్నిస్తుంటాడని విమర్శించాడు చిరు. తనతో పాటు పవన్ కళ్యాణ్‌ను కూడా వర్మ కించ పరిచే ప్రయత్నం చేశాడని చిరు అన్నాడు. రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడ్డం వేస్ట్ అంటూనే.. తన గురించి కొంచెం తీవ్రంగానే మాట్లాడాడు చిరు.

‘‘రామ్ గోపాల్ వర్మ గురించి ఏం మాట్లాడతాం. అది వేస్ట్. తనది టిపికల్ మెంటాలిటీ. చాలా చిత్రంగా మాట్లాడతాడు. ఆయనలో వెటకారం మరీ ఎక్కువ. ఎంతసేపూ నెగెటివ్‌గా మాట్లాడుతుంటాడు. ఒకరిని పొగడాలి అంటే పొగడొచ్చు. ఇబ్బందేమీ లేదు. అది డైరెక్టుగా ఉండాలి. అంతే కానీ.. ఒకరిని పొగడ్డానికి ఇంకొకరిని తెగడాల్సిన పని లేదు. వర్మ ఎప్పుడూ అదే చేస్తుంటాడు. కించ పరిచే వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఆ మధ్య ‘ఖైదీ నెంబర్ 150’కి సంబంధించి నేను లుంగీలో ఉన్న లుక్ రిలీజ్ చేశాం. దాని గురించి చీప్‌గా మాట్లాడాడు. జేమ్స్ కామెరూన్ ఇది చూస్తే షాకైపోతాడని.. ‘అవతార్’ పోస్టర్ కంటే ఇది గొప్పగా ఉందని వెటకారాలాడాడు. అతడికి మాస్ అంటే తెలియదు. మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన పోస్టర్ ఇది. ఇంకా చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తేస్తూనే అతణ్ని కూడా చాలాసార్లు కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. వర్మ మేధావి. ఎంతో తెలివితేటలున్నవాడు. ఆ మేధావితనాన్ని మంచి మంచి సినిమాలు తీయడానికి ఉపయోగించాలి. గొప్ప దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకోవాలి’’ అని చిరు చెప్పాడు.