చిరు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడు?

మొత్తానికి చిరంజీవి అన్ని విషయాల మీదా ఓపెన్ అయిపోయాడు. ‘ఖైదీ నెంబర్ 150’ ప్రమోషన్లలో భాగంగా అనేక వివాదాస్పద అంశాలపై తన స్పందన తెలియజేశాడు. ఐతే వివాదాల విషయంలో సాధ్యమైనంత సంయమనంతో.. డిప్లమాటిగ్గా మాట్లాడుతూ సమస్య సద్దుమణిగేలా మాట్లాడ్డం చిరంజీవి శైలి. కానీ తన కొడుకు విషయానికి వచ్చేసరికి చిరు కూడా ఈసారి సంయమనం కోల్పోయాడు. తన కొడుకులో లోపాల గురించి మాట్లాడిన నేపథ్యంలో యండమూరి మీద చిరంజీవికి బాగానే కోపం ఉన్నట్లు స్పష్టంగా తెలిసిపోయింది.

నవ్వుతూ మాట్లాడినా సరే.. యండమూరి విషయంలో తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కాడు చిరు. తన భార్య సురేఖ విషయంలో యండమూరి ఏకవచనాలు ఉపయోగించడం మీద చిరు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఏదో ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడతాడేంటి.. ఇదేం సంస్కారం అంటూ ప్రశ్నించాడు చిరు.

ఐతే యండమూరి చిరంజీవి కుటుంబానికి ఎంతో సన్నిహితుడన్న సంగతి అందరికీ తెలుసు. ఒకప్పుడు రచయితగా చిరుతో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసి.. ఆయన కుటుంబానికి చాలా సన్నిహితుడయ్యాడు యండమూరి. కాబట్టి ఆ చనువుతో సురేఖ పేరు పక్కన గారు చేర్చకపోయి ఉండొచ్చు. అందులోనూ ఆయన మాట్లాడింది కొన్ని వందల మంది విద్యార్థుల నడుమ ఆడిటోరియంలో.

అయినప్పటికీ ఇక్కడ చిరు అభ్యంతరం కరెక్టే అనుకుందాం. కానీ దాదాపు రెండు లక్షల మంది అభిమానుల్ని ముందుంచుకుని కోట్ల మంది టీవీల్లో చూస్తున్న పబ్లిక్ ఈవెంట్లో.. యండమూరి లాంటి పెద్దమనిషిని.. రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖ దర్శకుడిని వాడు వీడు.. మూర్ఖుడు.. అక్కుపక్షి లాంటి పదాలతో తిట్టిపోయాడం ఎంత వరకు సబబు? ఇదేం సంస్కారం..? నాగబాబు చాలా ఎమోషనల్ అని.. తన కోణంలో అది తప్పేమీ కాదని చిరంజీవి తీర్మానించడం ఎంతవరకు సబబు..? యండమూరి విషయంలో సంస్కారం గురించి మాట్లాడుతున్న చిరు.. తన తమ్ముడు సంస్కారం తప్పి హద్దులు దాటి మాట్లాడటాన్ని ఎలా సమర్థించుకుంటాడు?