గుడ్ న్యూస్: జూన్ నుంచి షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్.!

నిన్ననే(మే 21న) సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులంతా కలిసి సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే థియేటర్స్ పరిస్థితిపై చర్చించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయాలను సిద్ధం చేసుకున్నారు.

నేడు పలువురు సినిమా, టీవీ, డిజిటల్ మీడియా ప్రముఖులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి సీఎం కేసీఆర్ ని కలిసి విషయాన్ని వివరించారు. దానికి కేసీఆర్ చాలా సానుకూలంగా స్పందించారు.

‘సినీ పరిశ్రమపై ఎన్నో లక్షలాది మంది బ్రతుకున్నారు. వారికి జీవనాది కోల్పోకుండా ఉండాలంటే రీ ప్రొడక్షన్, షూటింగ్స్ మరియు థియేటర్స్ ని దశల వారీగా పునరుద్ధరించాలి. తక్కువ మందితో ఇండోర్ లో చేసుకునే రీ ప్రొడక్షన్ పనులు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. రెండవ దశలో భాగంగా జూన్ నుంచి షూటింగ్స్ ని మొదలు పెట్టాలి. వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్స్ చేసుకోవాలి. షూటింగ్స్ నడుస్తున్న పరిస్థితులను గమనించి, వాటి ద్వారా మంచి చెడులు అంచనా వేసి తరవాత దశలో థియేటర్స్ ని పునరుద్దరించేలా చూస్తాను. సినిమా పరిశ్రమ బతకాలి, అలాగే కరోనా కూడా వ్యాప్తి చెందకూడదు. త్వరలోనే ఎంతమందితో షూటింగ్స్ చేసుకోవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మొదలైన అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి మరియు ప్రభుత్వ కార్యదర్శులు కూర్చొని ఓ నివేదికను తయారు చేసి ఇవ్వాలని’ సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈ మీటింగ్ అనంతరం, సిఎం కేసీఆర్ స్పందించిన తీరుపై మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ఇలా పంచుకున్నారు. ‘ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు. ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియా కి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి, అందరికి మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు. సినిమా, టీవీ, డిజిటల్ మీడియా వారి తరపున కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని’ చిరంజీవి తెలిపారు.