‘భారత్ రాష్ట్రీయ సమితి’ పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్..!?

సీఎం కేసీఆర్ త్వరలో ‘భారత్ రాష్ట్రీయ సమితి’ (బీఆర్ఎస్) పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా 5గంటలపాటు జరిగిన అత్యవసర సమావేశంలో ఈమేరకు మంత్రులకు వెల్లడించినట్టు తెలుస్తోంది.

”త్వరలోనే ముఖ్యమైన ప్రకటన చేస్తాను”.. అని ఇటివల ప్రకటించిన కేసీఆర్ అందుకు సంకేతాలు ఇచ్చారా..? అనే చర్చ జరుగుతోంది. దీనిపై ఈనెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటైనా తానే సీఎంగా ఉంటూ దేశం కోసం పని చేస్తానని చెప్పినట్టు సమాచారం. పార్టీకి జై భారత్, నయా భారత్, భారత్ రాష్ట్రీయ సమితి వంటి పేర్లు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

కేసీఆర్ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీని కోరుకుంటున్నారు. జాతీయస్థాయిలో టీఆర్ఎస్ చురుకుగా వ్యవహరిస్తోంది. మన పథకాలకు దేశవ్యాప్తంగా స్పందన వస్తూండటంతో కేంద్రం ఇబ్బందులు పెడుతోంది. బీజేపీని గద్దె దించాల్సిన సమయం వచ్చింది’ అని అన్నారు.