యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళుతూనే ఉన్నారు. కలో గంజో సొంతూళ్లోనే తాగుదామనే భావనతో స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వారిలో ఎంతమంది తిరిగి వస్తారో అని ఇప్పటికే నిర్మాణ రంగ సంస్థలు, ఇతరత్రా పరిశ్రమలు ఆందోళన చెందుతున్నాయి.

ముఖ్యంగా నిర్మాణ రంగానికి సంబంధించి ఉత్తరప్రదేశ్, బీహార్ కార్మికులకు నైపుణ్యత ఎక్కువ. ఈ నేపథ్యంలో వారు తిరిగి వస్తారా రారా అని ఆయా సంస్థలు అయోమయంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

తమ రాష్ట్రానికి సంబంధించిన వలస కార్మికుల విషయంలో యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 23 లక్షల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చారని.. వారందరికి ఉపాధి, సామాజిక భద్రత కల్పించేందుకు మైగ్రేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వారందరికీ జీవిత బీమా కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. ఇకపై తమ కార్మికులను ఏ రాష్ట్రాలైనా తీసుకెళ్లాలంటే తమ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు.

‘‘యూపీ కార్మికుల శక్తి సామర్థ్యాలు రాష్ట్ర పురోగతికి బాటలు వేయాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. యూపీ కార్మికులు ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చూశాం. ముఖ్యంగా లాక్ డౌన్ కాలంలో అమానవీయ పరిస్థితులు, వివక్షకు గురయ్యారు. అన్న పానీయాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇకపై వారు అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటాం. వారికి ఉపాధితోపాటు సామాజిక భద్రత కల్పిస్తాం’’ అని యోగి ప్రకటించారు.

కేంద్రంతోపాటు ఏ రాష్ట్రమూ వలస కూలీల పట్ల సరైన విధంగా వ్యవహరించని నేపథ్యంలో యోగి నిర్ణయం ప్రశంసలు కురిపిస్తోంది. మరి మిగిలిన రాష్ట్రాలు కూడా ఆయన బాటలో పయనిస్తాయో లేదో చూడాలి.