దాసరి ‘అమ్మ’ గా రమ్యకృష్ణ?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా మూడు భాషల్లో సినిమా తెరకెక్కబోతోంది.  దర్శక రత్న దాసరి నారాయణ రావు ఈ చిత్రాన్ని తీస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.  జయలలిత పాత్ర కోసం రమ్యకృష్ణ, హేమమాలినితో సంప్రదింపులు జరుపుతున్నారు. చిత్ర నిర్మాణాన్ని కూడా కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేయాలని దాసరి నిర్ణయించారు.

సీనియర్ దర్శకుడిగా దాసరి నారాయణరావు జయలలితకు సుపరిచితులు. సినీరంగంలో ఆమె జీవితాన్ని సమీపంగా గమనించినవారిలో ఆయన ఒకరు.  ఈ చిత్రంలో జయ గురించి తనకు తెలిసిన విషయాలను కూడా దాసరి ప్రజలకు చూపించనున్నట్టు తెలుస్తోంది.

సాధారణ కుటుంబం నుంచి సినీ రంగ ప్రవేశం చేయడం, అక్కడ అనేక ఆటుపోట్లు ఎదుర్కోవడం, శోభన్‌బాబు, ఎంజీఆర్‌తో స్నేహం, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తిరుగులేని శక్తిగా ఎదగడం ఇలా ఎన్నో ఆసక్తికర ఘట్టాలు ఆమె జీవితంలో ఉన్నాయి. వీటన్నింటిని తెరకెక్కించేందుకు దాసరి సిద్ధమయ్యారు. ఇప్పటికే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పనులను కూడా దాసరి మొదలుపెట్టారట.

సినిమాకు పేరు విషయంలో ఎలాంటి శషభిషలు లేకుండా అందరూ ఆమెను పిలుచుకునే ఆప్యాయమైన పిలుపు ‘అమ్మ’  అనేదే ఖరారు చేశారు. ఆ టైటిల్ ను కూడా రిజిస్టర్ చేశారు. చిత్రీకరణ మొదలుపెట్టడమే తరువాయి.  బాహుబలిలో శివగామి.. నరసింహలో నీలాంబరి వంటి పాత్రలతో యాంగ్రీ ఉమన్ గా అదరగొట్టిన రమ్యకృష్ణకే అమ్మ పాత్ర లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.