దేవిశ్రీ టచ్ చేసేశాడబ్బా..

ఆల్రెడీ తన తండ్రికి నివాళిగా నాన్నకు ప్రేమతో.. పాటను ట్యూన్ చేసి కోట్లాది మంది మనసుల్ని టచ్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు తన గురువు మాండలిన్ శ్రీనివాస్‌కు నివాళిగా అతను రూపొందించిన ‘గురవేనమ’ పాట అదే స్థాయిలో జనాల్ని కదిలిస్తోంది. దేవిశ్రీకి చిన్నతనంలోనే సంగీత పాఠాలు చెప్పి అతడి ప్రతిభకు సానబెట్టింది మాండలిన్ శ్రీనివాసే. గురువు మీద తన అభిమానాన్ని పలు సందర్భాల్లో చాటుకున్నాడు దేవిశ్రీ. ఇప్పుడు ఆయనకు నివాళిగా అద్భుతమైన లిరిక్స్‌తో పాటను రూపొందించి.. దాన్ని స్వయంగా తనే ఎంతో ఆర్ద్రతతో పాడి చక్కటి ట్యూన్ కట్టి సంగీత ప్రియుల్ని మెప్పించాడు దేవిశ్రీ.

సరిగమ పదనిస అనే అక్షరాల్నే ఆధారంగా చేసుకుని సీనియర్ లిరిసిస్ట్ జొన్నవిత్తుల ఈ పాటను రాయడం విశేషం. ఏదో ఒక భాషకు పరిమితం కాకుండా ఆయన సంస్కృతంగా ఈ పాటను రాశారు. దీంతో వివిధ భాషలకు చెందిన మాండలిన్ శ్రీనివాస్ అభిమానులందరికీ ఈ పాట చేరువయ్యేందుకు అవకాశముంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమం కూడా చాలా పెద్ద స్థాయిలో చేశాడు దేవిశ్రీ. త్వరలో గురువుకు నివాళిగా ఒక మ్యూజికల్ కన్సర్ట్ కూడా చేయబోతున్నాడు దేవి.

డ్రమ్మర్ శివమణితో పాటు ఎంతోమంది ప్రముఖ మ్యూజీషియన్స్ ఈ కన్సర్ట్‌లో పాల్గొంటారు. తనకు సంగీత పాఠాలు నేర్పిన గురువును గుర్తుంచుకుని ఆయనకు నివాళిగా దేవి చేస్తున్న ఈ ప్రయత్నం అందరి మన్ననలు అందుకుంటోంది. మాండలిన్ శ్రీనివాస్ 45 ఏళ్ల వయసులోనే 2014లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.