సెకండాఫ్ బాగుండదులే అనుకున్నా..

డైరెక్టర్ తేజ రూటే వేరు. ఎవరినైనా ఎంత మాటైనా అనేస్తాడు. మొహమాటం లేకుండా మాట్లాడతాడు. ఒక మూసలో సాగే తెలుగు సినిమాల గురించి తరచుగా విమర్శలు గుప్పిస్తుంటాడు తేజ. ప్రస్తుతం రానా దగ్గుబాటితో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా చేస్తున్న తేజ.. రానా లేటెస్ట్ మూవీ ‘ఘాజీ’ చూసి షాకైపోయాడట.

ఈ సినిమా విపరీతంగా నచ్చేసి రానాతో తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూ చేశాడు తేజ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానా తనను ‘ఘాజీ’ సినిమా చూడమని చెప్పినపుడు తటపటాయించినట్లు చెప్పాడు. ఈ సినిమా బాగోదని ఆయన అనుకున్నాడట. బలవంతంగానే సినిమా చూశానని.. ఐతే సినిమా చూశాక తన ఆలోచనలన్నీ మారిపోయాయని తేజ చెప్పాడు.

‘‘నాతో రానా సినిమా చేస్తుండటంతో ‘ఘాజీ’ చూడమన్నాడు. నాకు ఆ సినిమా గురించి పెద్దగా ఏమీ తెలియదు. అసలు టైటిల్ చూస్తే అది ‘ఘాజీ’నా ‘షూజీ’నా అన్న సందేహం ఉండేది. ఆ సినిమా పోస్టర్ ఏమాత్రం ఎగ్జైట్మెంట్ కలిగించలేదు. నీళ్ల లోపల యుద్ధం అంటున్నారు.. ఏం చూపిస్తారో అనుకున్నా. థియేటర్ లోపలపెట్టి మడతెట్టేస్తారనుకున్నా. సినిమా బాగుండదేమో.. తర్వాత రానాకు బాగాలేదని ఎలా చెప్పాలో అని తటపటాయించా. అందుకే థియేటర్ బయటే ఉండి వెనక్కి వెళ్లిపోదామా అని కూడా ఆలోచించా.  ఐతే రానా ఫోన్ చేసి లోపల వెయిటింగ్ అని చెప్పాడు. ఇక తప్పదని లోపలికి వెళ్లా. మొదట ఐదు పది నిమిషాలు మామూలుగా అనిపించింది. కానీ తర్వాత సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయా. ఫస్టాఫ్ చాలా బాగా అనిపించింది. కానీ సెకండాఫ్ బాగుండదులే అనుకున్నా. కానీ ద్వితీయార్ధం ఇంకా బాగా అనిపించింది. ఈ సినిమా చూస్తూ ఎన్నో కొత్త విషయాలు తీసుకున్నా. చాలా థ్రిల్లయ్యాను. అద్భుతమైన సినిమా. తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఊహించలేని విషయం’’ అని తేజ అన్నాడు.