నంద్యాల రాజకీయం అప్పుడే మొదలెట్టేశారు

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం అంద‌రినీ దిగ్భ్రాంతికి గురి చేసిన సంగ‌తి తెలిసిందే. భూమా అంత్య‌క్రియ‌లు ప్రారంభం కాకముందే ఆయ‌న ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. అంత్యక్రియలైనా కాకముందే అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీల నుంచి ఎవ‌రు పోటీ చేయ‌నున్నార‌నే విశ్లేష‌ణ‌ను ఇటు కొంద‌రు పార్టీనేత‌లు, రాజ‌కీయ వ‌ర్గాలు మొద‌లుపెట్టేశార‌ని తెలుస్తోంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమకు, ముఖ్యంగా కర్నూలుకు అన్యాయం జరిగిందన్న సెంటిమెంట్‌ జిల్లాలో బలంగా ఉంది. వెనుకబడ్డ ప్రాంతాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రత్యేక హోదా, సీమ అభివృద్ధి చర్చల్లోకొస్తే తమ పని అంతేనని, సానుభూతి పని చేయదని, పైగా ఫిరాయింపు కళంకం ఉందని వాదనలు బయలుదేరాయి. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ పోటీకి దిగ‌వ‌చ్చ‌ని చెప్తున్నారు.

2014 సాధారణ ఎన్నికల్లో  నంద్యాల నుంచి వైసీపీ తరఫున గెలిచిన భూమా నాగిరెడ్డి అనంతరం టీడీపీలో చేరారు. ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కూడా పసుపు కండువా క‌ప్పుకున్నారు. భూమా కుటుంబంలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తర్జభర్జన పడుతున్న తరుణంలో నాగిరెడ్డి ఆదివారం చనిపోయారు. ఇదిలా ఉండగా వైసీపీ నుంచి టీడీపీకి దశల వారీగా ఫిరాయించిన 21 మందిపై అనర్హత వేటు వేయాలని వైసిపి పట్టుబడు తుండగా, అదే జరిగితే ఉప ఎన్నికలొస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికలను రానీకుండా అధికారపార్టీ అన్ని వ్యూహాలూ అమలు చేస్తోంది. అయితే నాగిరెడ్డి మరణంతో నంద్యాలలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరు మాసాల్లోపు ఎప్పుడైనా ఉప ఎన్నికలు ఉంటాయి. దీంతో నంద్యాలలో తమ అభ్యర్ధులను నిలపడంపై అప్పుడే రెండు పార్టీలూ అంతర్గత చర్చలు మొదలుపెట్టాయని సమాచారం.  అయితే ఎవరైనా సిట్టింగ్‌ ఎమ్మెల్యే చనిపోతే ఏ పార్టీకి చెందిన వారైతే ఆ పార్టీకి వదిలిపెట్టి ఎన్నిక ఏకగ్రీవం చేసే ఆనవాయితీ చాలా సందర్భాల్లో అమలైంది.

2014 ఎన్నికలైన కొద్ది రోజులకే కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌ గుండెపోటుతో చనిపోగా అక్కడ వైసీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని బరిలోకి దింపి ఎన్నిక ఏకగ్రీవం కానీలేదు. అయినప్పటికీ టీడీపీ బరిలోకి దింపిన తంగిరాల ప్రభాకర్‌ కుమార్తె సౌమ్య విజయం సాధించారు. కాగా నంద్యాల అందుకు పూర్తి భిన్నమని పేర్కొంటున్నారు. ఫిరాయింపుదారుడైన భూమా పై అనర్హత వేటు వేయాలని ఇప్పటి వరకు డిమాండ్‌ చేసి, అంతలోనే పోటీకి అభ్యర్థిని నిలపక పోతే ఉద్దేశపూర్వకంగా టీడీపీకి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కట్టబెట్టినట్లవుతుందని, ఉప ఎన్నికలపై చిత్తశుద్ధి లేదన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ నేతలంటున్నారు. అభ్యర్థిని నిలబెట్టడమే మంచిదన్న అభిప్రాయం వైసీపీలోని కొంద‌రి నుంచి వినిపిస్తోంది.

స్వతహాగా నంద్యాలలో వైసీపీ గెలిచినందున తమకు వదిలేయాలని టీడీపీ ముందు గట్టిగా ప్రతిపాదన పెట్టాలంటున్నారు. గత ఆనవాయితీని గుర్తుచేసి పోటీ పెట్టవద్దని వైసీపీని కోరాలని, అందుకు వైసీపీ అంగీకరించకపోతే సానుభూతి ఓటుతో నంద్యాలలో గెలుపొంది, తమ పాలనకు రెఫరండం అని, ఉప ఎన్నికలకు భయపడేది లేదని, మొత్తంగా ఫిరాయిం పులు సమర్ధనీ యమేననంటూ ప్రచారం చేసి వైసీపీని ఎదుర్కోవాలని టీడీపీ నేతలు సూచిస్తున్నారు. ఒక వేళ టీడీపీ, వైసీపీలు ఏకగ్రీవం కోసం ప్రయత్నించినా నందిగామ వలే కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, స్వతంత్రులు బరిలోకి దిగితే ఎన్నికలు అనివార్యమవుతాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

కాగా ఆళ్లగడ్డ భూమా కుటుంబానికి కంచుకోట. శోభానాగిరెడ్డి మరణం తర్వాత ఉప ఎన్నికల్లో కుమార్తె అఖిలప్రియ అక్కడి నుంచి గెలుపొందారు. నంద్యాలకు నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నంద్యాలలో భూమా కుటుంబానికి అంతగా పట్టు లేదని, పైగా మైనార్టీల ఓటింగ్‌ అధికమని, బీజేపీ-టీడీపీ పొత్తు వలన భూమా కుటుంబం నుంచి టీడీపీ ఎవరినైనా పోటీలోకి దింపినా సానుభూతి ఓటుతో వైసీపీపై విజయం సాధించడం అంత సులువు కాదనే టాక్ కూడా ఉంది.