రెండు కోట్ల అమెరిక‌న్ల‌ను రోడ్డున ప‌డేస్తున్నావేం ట్రంప్?

తాజా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా నిర్ణ‌యాల‌ను స‌మీక్షించ‌డం, అవ‌కాశం కుదిరితే ర‌ద్దు చేయ‌డ‌మనే ఎపిసోడ్‌తో ముందుకు సాగుతున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణ‌యం అమెరిక‌న్ల‌కు షాక్ ఇస్తోంద‌ని అంటున్నారు.

ప్రజలకు ఆరోగ్య బీమా కల్పిస్తున్న ఒబామాకేర్‌ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చేం దుకు రూపొందించిన ముసాయిదా బిల్లు చట్టంగా మారితే దాదాపు 2.2 కోట్ల మంది అమెరికన్లు ఆరోగ్యబీమాకు దూరమవుతారని నాన్‌ పార్టిజన్‌ కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుత చట్టంతో పోల్చుకుంటే 2018 చివరి నాటికి బీమా సౌకర్యం లేని వారు 1.5 కోట్ల మంది ఉంటారని, ఈ సంఖ్య 2026 నాటికి 2.32కోట్ల మందికి చేరుతుందని బిల్లులో పేర్కొన్నారు.

అయితే సెనేట్‌ పరిశీలనలో ఉన్న ఈ బిల్లు చట్టంగా మారితే దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న అమెరికన్‌ ఫెడరల్‌ ద్రవ్యలోటును 32,100 కోట్ల డాలర్ల స్థాయికి తగ్గించే అవకాశం వుందని బడ్జెట్‌ కార్యాలయం వివరించింది. ఈ బిల్లుకు సెనేట్‌ ఆమోదముద్ర పొందేందుకు రిపబ్లికన్‌ సెనేటర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రతినిధుల సభ గత నెలలో ఆమోదించిన బిల్లు తరహాలోనే ఉన్న ఈ సెనేట్‌ బిల్లు అధికశాతం మంది అమెరికన్లకు ఆరోగ్యబీమా సౌకర్యాన్ని రద్దు చేస్తుంది.

పునర్వ్యవస్థీకరించిన పన్ను చట్టం ప్రకారం వ్యక్తిగతంగా ఆరోగ్య బీమాపాలసీలు కొనుగోలు చేసే వారికి టాక్స్‌ క్రెడిట్‌లు కల్పిస్తారు. దీనితో పాటే అల్పాదాయ వర్గాల వారికి ఆరోగ్య బీమా కల్పించే ఫెడరల్‌ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమం మెడికెయిడ్‌ కూడా రద్దవుతుంది. డెమొక్రాటిక్‌ పార్టీ సెనేటర్లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిలిచే సూచనలు కన్పిస్తుండగా, రిపబ్లికన్లలోని ఇద్దరు సెనేటర్లు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.