నీరసంగా బుకింగులు, బయ్యర్లకి గుబులు

‘సింగం 3’ చిత్రానికి అదిరిపోయే క్రేజ్‌ వుందని, ఖచ్చితంగా ఓపెనింగ్‌ అదరగొడుతుందని ట్రేడ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసింది. కానీ వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రంపై ఆసక్తి బాగా సన్నగిల్లినట్టుంది.

డిసెంబర్‌లో రిలీజ్‌ అన్నప్పుడు కనిపించిన ఉత్సాహం ఇప్పుడయితే లేదు. ప్రమోషన్స్‌ పరంగా కూడా ఎవరూ యాక్టివ్‌గా లేరు. పలుమార్లు ప్రమోషన్‌ క్యాంపైన్స్‌ చేసేసి వుండడంతో అందరిలోను నైరాశ్యం కనిపిస్తోంది. రేపు రిలీజ్‌ అవుతోన్న ఈ చిత్రానికి అడ్వాన్స్‌ బుకింగ్‌ ట్రెండ్‌ ఇప్పటికైతే చాలా వీక్‌గా వుంది. ఇది మంచి పరిణామం కాదని బయ్యర్లు గుండెలు చేత్తో పట్టుకున్నారు.

అసలే వారం మధ్యలో సెలవు కూడా లేని రోజున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఓపెనింగ్స్‌ సహజంగానే ఎఫెక్ట్‌ అవుతాయి. కానీ జనంలో ఇంట్రెస్ట్‌ కూడా లేదంటే కనుక కోట్ల పెట్టుబడి పెట్టిన వారికి ఇబ్బందే. నీరసంగా సాగుతోన్న బుకింగులతో బయ్యర్లు గుబులు పడుతున్నా కానీ మాస్‌ సినిమా కనుక కరెంట్‌ బుకింగ్‌ బాగుంటుందని కాస్త నమ్మకంగా వున్నారు. రేపు సింగిల్‌ స్క్రీన్లలో సింగం 3 రచ్చ మొదలవుతుందని ఆశిస్తున్నారు. ఏదేమైనా విడుదలకి ముందు తప్పక చూడాలనే ఆసక్తి కలిగించడంలో ఈ చిత్ర రూపకర్తలు ఫెయిలయ్యారు.

రెండుసార్లు ట్రెయిలర్‌ కట్‌ చేసినా ఆకట్టుకునేలా కట్‌ చేయడంలో విఫలమయ్యారు. రిలీజ్‌కి ముందు బజ్‌ ఎలాగో లేదు కాబట్టి ఇక రేపు మార్నింగ్‌ షోకి వచ్చే టాక్‌ మీదే సింగం 3 భవిష్యత్తు ఆధారపడుతుంది.