‘డీజే’ సత్తా ఏంటో ఇప్పుడు చూద్దాం

గత శుక్రవారం విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’కు డివైడ్ టాక్ వచ్చింది. కానీ టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు మాత్రం మోతెక్కిపోయాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత భారీ సినిమా ఏదీ విడుదల కాకపోవడం.. అందులోనూ ఈ నెలంతా బాక్సాఫీస్‌ స్లంప్‌లో నడవడం.. ప్రమోషన్ బాగా చేసి హైప్ పెంచడం.. ఒక పెద్ద సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న టైంలో రిలీజవడం.. ఇవన్నీ కలిసొచ్చి ‘డీజే’ తొలి వారాంతంలో కలెక్షన్ల పంట పండించుకుంది.

సోమవారం రంజాన్ సెలవు కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. చాలా వరకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఐతే ఈ సినిమా అసలు సత్తా ఏంటన్నది మంగళవారం తేలుతుంది.

ఈ రోజుల్లో పెద్ద సినిమాలు వేటికైనా తొలి వారాంతంలో వసూళ్లు బాగానే ఉంటున్నాయి. వీకెండ్ తర్వాతే సినిమాలు నిలవడం కష్టంగా ఉంటోంది. మరి ‘దువ్వాడ జగన్నాథం’ కలెక్షన్లు మంగళవారం ఎలా ఉన్నాయన్నదాన్ని బట్టి ఈ సినిమా భవితవ్యం ఏంటన్నది తేలుతుంది.

హిట్టు సినిమాకు కూడా వీకెండ్ తర్వాత వసూళ్లు తగ్గుతాయి కానీ.. డ్రాప్ ఏమేరకు ఉందన్నది కీలకమవుతుంది. కలెక్షన్లు ఓ మోస్తరుగా ఉంటే సినిమా గట్టెక్కేసినట్లే. రివ్యూలు నెగెటివ్‌గా ఉన్నప్పటికీ కలెక్షన్లు అద్భుతంగా ఉన్నాయంటూ ‘డీజే’ టీం అంతా థ్యాంక్స్ మీట్లో ఊదరగొట్టేసింది. విమర్శకుల్ని టార్గెట్ చేసుకుని అటాక్ చేసింది. రంజాన్ సెలవు రోజే థ్యాంక్స్ మీట్ పెట్టడం వల్ల ఆ రోజు కూడా వసూళ్లు బాగున్నాయని చెప్పుకునే అవకాశం దక్కింది చిత్ర బృందానికి. మరి వాళ్ల వాదనలో ఎంత బలముందో మంగళవారం వసూళ్లను బట్టి తేలుతుంది.