ఈటెల ఎపిసోడ్: మంత్రి జగదీష్ రెడ్డికి లైన్ క్లియర్

ఈటెల రాజేందర్ తరహాలోనే మంత్రి జగదీష్ రెడ్డిపైనా వేటు పడబోతోందంటూ కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగిన విషయం విదితమే. అయితే, ఈటెల రాజేందర్ మీద వేటు వేశాక వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం అప్రమత్తమయ్యింది మంత్రి జగదీష్ రెడ్డి.. పార్టీ ముఖ్య నేతలు ఆయనతో నడిపిన రాయబారం ఫలించింది. కుమారుడి పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో తలెత్తిన వివాదం సమసిపోయేలా చేయగలిగింది ఆ రాయబారం.

దాంతో, మంత్రి జగదీష్ రెడ్డి తన చుట్టూ దుష్ప్రచారం జరుగుతోందనీ, తాను పార్టీని వీడబోవడంలేదని ప్రకటించేశారు. ఈటెలపై విమర్శలూ చేసేశారు. ఇక, ఇప్పుడు ఈటెల మీదకి మంత్రి జగదీష్ రెడ్డినే అస్త్రంగా ప్రయోగిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి. తాజాగా మరోమారు ఈటెలపై తీవ్రమైన విమర్శలు చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. అడవిలో గుంపుగా వుంటేనే ప్రయోజనమనీ, గుంపులోంచి బయటకు వెళితే సింహాల బారిన పడటం ఖాయమని ఈటెల రాజేందర్ మీద సెటైర్లు వేశారు జగదీష్ రెడ్డి.

అయితే, ‘పందుల గుంపులో వుండటం కంటే, బయటకు వచ్చి చావో రేవో తేల్చుకోవడమే మంచిది..’ అంటూ ఈటెల అనుచరులు, మంత్రి జగదీష్ రెడ్డి మీద మాటల దాడికి దిగారు సోషల్ మీడియా వేదికగా. బీజేపీలో చేరాక ఈటెల రాజేందర్ రాజకీయంగా ఎంత లాభపడతారు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే, ఈటెలను అన్యాయంగా వేధించారన్న భావన అయితే తెలంగాణ సమాజంలో కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ వ్యవహారం అస్సలు మింగుడుపడ్డంలేదు.

ఈటెల మీద ఎంతలా తెలంగాణ రాష్ట్ర సమితి విమర్శలు చేస్తే, అది తెలంగాణ రాష్ట్ర సమితికీ, ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వానికీ అంత నష్టం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఈటెలను విమర్శించడమంటే తెలంగాణ రాష్ట్ర సమితి తన నెత్తిన తానే బురద గుమ్మరించుకున్నట్లవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఈటెల వ్యవహారం తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి.. వివాదం సమసిపోయినట్లే కనిపిస్తున్నా.. ఎప్పుడు ఎవరి వికెట్ ఎలా పడిపోతుందో తెలియని పరిస్థితి మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితిలో వుంది.