పవన్‌ కీబోర్డ్‌ పోరాటం ఆపడా?

పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ మళ్లీ రీయాక్టివేట్‌ అవడం ఫాన్స్‌కి సంతోషాన్నిచ్చింది. దాదాపు నాలుగు వారాల పాటు ట్విట్టర్‌కి దూరమైన పవన్‌ స్పెషల్‌ స్టేటస్‌ కోసం కాంగ్రెస్‌ చేసే పోరాటానికి మద్దతు తెలుపుతూ తిరిగి ట్విట్టర్‌లో రీఎంట్రీ ఇచ్చాడు.

పవన్‌ తిరిగొచ్చాడని ఆనందపడాలో, మరోసారి స్పెషల్‌ స్టాటస్‌ పోరాటాన్ని కీబోర్డ్‌ మీదుగానే చేస్తున్నాడని విచారించాలో అర్థం కాని అయోమయంలో అభిమానుల్ని పడేసాడు. మార్చిలో స్పెషల్‌ స్టేటస్‌ గురించి పవన్‌ గళమెత్తినపుడు, పరీక్షల సమయం కనుక తాను చేసే పోరాటాన్ని మే నెలకి వాయిదా వేస్తున్నట్టు పవన్‌ ప్రకటించాడు.

తీరా మే నెలలో త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌తో పవన్‌ బిజీ అయిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తోంటే వారికి మద్దతు తెలిపాడు. ఈ విషయంలో ఎవరు పోరాటం చేసినా తన మద్దతు వుంటుందని చెప్పాడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ని తరిమికొట్టమని చెప్పి, ఇప్పుడు వారికి మద్దతునివ్వడంతో అసలు పవన్‌ పార్టీ విధి విధానాలు ఏమిటో, వచ్చే ఎన్నికల్లో అతని స్టాండ్‌ ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.

ఇలా సీరియస్‌నెస్‌ లేని రాజకీయ వాదం వల్ల పవన్‌ కళ్యాణ్‌ని జనం సీరియస్‌గా తీసుకుంటారనిపించడం లేదు. ముఖ్యంగా సినిమా రంగాన్ని విడిచి బయటకి రాలేని ఆర్థిక పరిస్థితి కనుక పూర్తి స్థాయి రాజకీయాలతో పవన్‌ బిజీ అయ్యేది ఏనాటికనేది అర్థం కావడం లేదు.