మిలియన్ కాదు.. అంతకుమించి

యుఎస్ తెలుగు ఆడియన్స్ టేస్టుకు చక్కగా సరిపోయేలా ఉండటం.. మంచి టాక్ కూడా రావడంతో ‘ఫిదా’ అక్కడ మంచి వసూళ్లు రాబడుతుందని.. మిలియన్ మార్కును కూడా అందుకోవడం గ్యారెంటీ అని అంతా అంచనా వేశారు. ఐతే యుఎస్‌లో ఈ సినిమా వసూళ్లు అంచనాల్ని మించిపోయేలా ఉన్నాయి. మిలియన్ మార్కు దగ్గర ఈ సినిమా ఆగేలా కనిపించడం లేదు. ఈజీగా 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి.. 2 మిలియన్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 7.15 లక్షల డాలర్లు కొల్లగొట్టేసింది.
ప్రిమియర్లతో కలిపి తొలి రోజే 3.6 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘ఫిదా’.. శనివారం కూడా దాదాపుగా అంతే స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఆదివారం కూడా మంచి వసూళ్లే వచ్చే అవకాశముంది.

సోమ-మంగళవారాలకే ఈ చిత్రం మిలియన్ మార్కును అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీక్ డేస్‌లో కూడా ‘ఫిదా’ వీక్ అయ్యే పరిస్థితేమీ కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని యుఎస్‌లో విడుదల చేయడమే 140 లొకేషన్లలో భారీగా విడుదల చేయగా.. రిలీజ్ తర్వాత మరిన్ని స్క్రీన్లు పెంచారు. తర్వాతి వారం రాబోతున్న ‘గౌతమ్ నంద’ మాస్ సినిమా కాబట్టి ‘ఫిదా’ కలెక్షన్లపై అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. తర్వాతి వారం రాబోయే నక్షత్రం, దర్శకుడు నుంచి కూడా ‘ఫిదా’కు పెద్ద ప్రమాదం లేకపోవచ్చు. కాబట్టి ‘ఫిదా’ మూడు వారాల పాటు వసూళ్లు దున్నుకునే అవకాశముంది. 2 మిలియన్ మార్కును అందున్నా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.