మహేష్‌బాబు అయితే ఫ్లాపయ్యేది!

ఫిదా కథని మహేష్‌తో పాటు మరికొందరు స్టార్‌ హీరోలకి శేఖర్‌ కమ్ముల చెప్పాడు. వాళ్లెవరూ ఇది చేయడానికి సాహసించలేదు. మహేష్‌ అయితే ఈ కథ బాగుంది కానీ తనకి సెట్‌ అవదని చెప్పేసాడట. దాంతో పెద్ద హీరోల తీరు మారాలని, ఎప్పుడూ ఒకే తరహా చిత్రాలు కాకుండా అప్పుడప్పుడూ తమ కంఫర్ట్‌ జోన్‌లోంచి బయటకి రావాలని కమ్ముల అన్నాడు.

ఫిదా ఖచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందని, చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూస్తారని అన్నాడు. అతను చెప్పినట్టుగానే చూస్తున్నారు కానీ అతను అన్నట్టుగా ఇది మహేష్‌తో తీసినట్టయితే మాత్రం ఇబ్బంది వచ్చేది. ఎందుకంటే ఇది హీరోయిన్‌ ప్రధానంగా నడిచే కథ. వరుణ్‌ తేజ్‌లా ఇంకా ఇమేజ్‌ లేని హీరోనే హీరోయిన్‌ డామినేట్‌ చేసిందని అంటున్నారు. ఇక మహేష్‌లాంటి సూపర్‌స్టార్‌ వుండుంటే పరిస్థితి ఏంటి? కొన్ని కథలకి స్టార్‌ ఇమేజ్‌ అడ్డు వస్తుంది. ఇమేజ్‌ లేని హీరోలు చేయడం వల్లే కొన్ని సినిమాలు హిట్టవుతాయి.

పవన్‌ కెరియర్‌ మొదట్లో తొలిప్రేమ చేసాడు. అప్పుడు హిట్టయిందని ఇప్పుడు కూడా అలాంటిది చేస్తే ఏమవుతుంది? మహేష్‌ చాలా సార్లు హిట్‌ కథలు మిస్‌ అయ్యాడు కానీ ఫిదా మిస్‌ అయినందుకు మాత్రం అభిమానులు ఫీలవడం లేదు. దీనికి మహేష్‌ యాక్టర్‌గా ప్లస్‌ అయి వుండేవాడేమో కానీ, స్టార్‌గా మైనస్‌ అయ్యేవాడనేది అందరి నిశ్చితాభిప్రాయం.