గీతం వర్సిటీ.. పండింది ‘ఆక్రమణల’ పాపం.!

ఆంధ్రప్రదేశ్‌లో గీతం వర్సిటీకి వున్న పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? తెలుగునాట ఉత్తమ ప్రైవేటు వర్సీటీల్లో ‘గీతం’కి చాలా పేరు ప్రఖ్యాతులున్న మాట వాస్తవం. అయితే, ‘గీతం’ వెనుక చాలా రాజకీయం కూడా వుంది. మరీ ముఖ్యంగా ‘ఆక్రమణల రాజకీయం’పై గీతంపై ఎన్నో ఏళ్ళుగా ఆరోపణలు వున్నాయి. ఇప్పుడీ ఆక్రమణల పాపం పండినట్లుంది.

చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా భూ ఆక్రమణలకు గీతం వర్సిటీ యాజమాన్యం పాల్పడిందని ఆరోపిస్తూ వచ్చిన వైసీపీ, తాము అధికారంలోకి రాగానే ‘చర్యలు’ చేపట్టిందట. గడచిన ఐదు నెలలుగా తెరవెనుక వ్యవహారం గుట్టుగా సాగిపోతోంది. ఈ రోజు ఉదయమే బుల్డోజర్లను వెంటేసుకుని అధికారులు, వర్సిటీకి చెందిన కొన్ని నిర్మాణాల్ని నేలకూల్చారు. ‘ప్రస్తుతం కూల్చివేతలు తక్కువగానే జరిగాయి.. ముందు ముందు ఇంకా జరగబోతున్నాయి.. 40 ఎకరాలకు పైగా ఆక్రమణలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఐదు నెలలుగా యాజమాన్యానికి సమాచారం ఇస్తూనే వున్నాం.. ఇదేమీ రాత్రికి రాత్రి జరిగిన చర్య కాదు..’ అంటూ అధికారులు స్పందించడం గమనార్హం.

ప్రస్తుతానికైతే ప్రహరీ గోడతోపాటు, ఓ ప్రవేశ ద్వారాన్ని కూల్చారట. రానున్న రోజుల్లో కొన్ని ముఖ్యమైన భవనాలు కూల్చే అవకాశం వుందని అధికారులు అంటున్నారు. విశాఖలో గీతం యూనివర్సిటీ ఆక్రమాల గురించి అందరికీ తెలిసిందేననీ, చంద్రబాబు హయాంలో గీతం వర్సిటీ యాజమాన్యం అడ్డగోలు ఆక్రమణలకు తెరలేపిందనీ, టీడీపీ నేతలు నడుపుతోన్న గీతం యూనివర్సిటీ, రాజకీయాలకు వేదికగా మారిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం గమనార్హం.

కాగా, ఇది కుట్రపూరిత చర్య అనీ, కక్ష సాధింపు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం అని టీడీపీ యాగీ చేస్తోంది. కొద్ది రోజుల క్రితమేట టీడీపీ నేత సబ్బం హరి, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ, ఆయన ఇంటికి సంబంధించిన కొంత భాగాన్ని కూల్చివేసిన విషయం విదితమే. వరుసగా టీడీపీ నేతలపైనే ఎందుకు ఈ తరహా దాడులు జరుగుతున్నాయి.? అన్న విషయమై ప్రభుత్వ పెద్దలు, ప్రజలకూ సమాధానమివ్వాల్సి వుంది.